జ‌పాన్ ఫ‌స్ట్ లుక్: కార్తీ మాయా మ‌శ్చీంద్ర రూపం?

Update: 2022-11-14 15:34 GMT
పాన్ ఇండియా ట్రెండ్ లో ఎంపిక చేసుకునే క‌థాంశానికి ఎక్కువ ప్రాధాన్య‌త పెరిగింది. రొటీనిటీని ఇప్పుడు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌టం లేదు. క‌థ‌- స్క్రిప్టు విష‌యంలో హీరోలు రాజీకి రావ‌డం లేదు. ఇక కెరీర్ తొలి నుంచి ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల‌ను ఎంచుకుని త‌న బాడీ లాంగ్వేజ్ కి త‌గ్గ స్క్రిప్టుల‌తో కార్తీ చాలానే ప్ర‌యోగాలు చేసాడు. ఇప్పుడు జ‌పాన్ పేరుతో మ‌రో ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టాడ‌ని తాజాగా రిలీజైన పోస్ట‌ర్ చెబుతోంది. కార్తీ తన కొత్త చిత్రం జపాన్ కోసం జోకర్ ఫేమ్ దర్శకుడు రాజు మురుగన్ తో జతకట్టారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌ ప్రకాష్ బాబు ఎస్‌.ఆర్‌ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇంత‌కుముందే విడుద‌లై వైర‌ల్ గా దూసుకెళుతోంది.

ఫ‌స్ట్ లుక్ పోస్టర్ చూడ‌గానే చాలా మ్యాజిక‌ల్ గా అనిపిస్తోంది. ఇందులోనే బోలెడంత ఫ‌న్ సెటైర్ కూడా ఎలివేట్ అవుతున్నాయి. కార్తీ చాలా ఛ‌మ‌త్కారంగా వింత‌గా  క‌నిపిస్తున్నాడు. అత‌డిలోని విభిన్న కోణాల‌ను ఈ పోస్ట‌ర్ ఆవిష్క‌రిస్తోంది. కార్తీ తన చేతిలో మద్యం బాటిల్ తో సోఫాలో నిద్రపోతూ క‌నిపించాడు. ఇదే పోస్ట‌ర్ లో ఇద్ద‌రు అమ్మాయిలు చేతిలో వైన్ గ్లాస్ తో నేలపై మ‌త్తుగా ప‌డి క‌నిపిస్తున్నారు. ఫ్లూటుగా తాగి ఆన‌క మ‌త్తు దిగ‌క‌పోవ‌డంతో అక్క‌డ చాలా ర‌చ్చ జ‌రిగిన‌ట్టు క‌నిపిస్తోంది.

మ‌రోవైపు కార్తీ నిదురిస్తున్న‌ సోఫా ఎగువ‌గా నిలువెత్తు ఫోటో ఫ్రేమ్ ఇంకాస్త వింత‌గా క‌నిపిస్తోంది. ఈ ఫోటోలో ఉన్న‌దీ కార్తీనే. అత‌డి ఒళ్లంతా బంగారం... కార్తీ పై నుండి క్రింది వరకు బంగారు ఆభరణాలు ధరించి కనిపించడంతో ఫోటో ఫ్రేమ్ చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బంగారం ధ‌గ‌ధ‌గ‌ల‌తో మాయల మ‌రాఠీని త‌ల‌పిస్తున్నాడు. అత‌డి సింహాస‌నం కూడా బంగారంతో శేష‌త‌ల్పాన్నే త‌ల‌పిస్తోంది. మొత్తానికి జ‌పాన్ టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఇందులో ఏదో మ‌ర్మం దాగి ఉంద‌ని ఫ‌స్ట్ లుక్ క్యూరియాసిటీని పెంచింది. మోస‌గాళ్ల‌కు మోస‌గాడిలాగా మాయా మ‌శ్చీంద్ర‌లాగా కార్తీ ఈ సినిమాలో స‌రికొత్త‌గా క‌నిపిస్తాడేమో చూడాలి.

తొలిసారిగా ఈ చిత్రంలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టించింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ ఈ సినిమాతో న‌టుడ‌వుతుండ‌గా.. టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మర సంభవం) వినేష్ బంగ్లాన్ జపాన్ ప్రొడక్షన్ డిజైన్ వ్య‌వ‌హారాల్ని చ‌క్క‌దిద్దుతున్నారు. జ‌పాన్ చిత్రాన్ని తమిళం- తెలుగు భాష‌ల్ని దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కిస్తున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ లో అన్ని భాష‌ల రిలీజ్ కి ప్లాన్ చేస్తారా? అన్న‌ది చిత్ర‌బృందం వెల్ల‌డించాల్సి ఉంటుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News