గర్వకారణం: మనమ్మాయిపై ఫ్రెంచ్ సినిమా

Update: 2015-07-23 17:16 GMT
ఆమె ఓ ఆటో రిక్షా నడుపుకునే ఓ పేద తండ్రి కూతురు. అసలే పెద్ద కుటుంబం, పైగా అమ్మాయి పుట్టిందేంటి అని ఆమె చిన్నపుడు బాధపడ్డాడు తండ్రి. కానీ ఇప్పుడా తండ్రి గర్వించే స్థాయికి ఎదిగిందా అమ్మాయి. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వారికి అందని ద్రాక్షలా కనిపించే ఐఐటీ-జేఈఈ పరీక్షలో విజయవంతమై ప్రస్తుతం ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం)లో విద్యనభ్యసిస్తోందా అమ్మాయి. తన పేరు నిధి ఝా. ఆ అమ్మాయి ఆ స్థాయికి చేరడానికి కారణం సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్. పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతుల్ని ఐఐటీ స్థాయికి చేర్చాలనే సమున్నత లక్ష్యంతో పని చేసే ఆనంద్ కుమార్ కు దేశవ్యాప్తంగా గొప్ప పేరుంది. పైసా డబ్బులు తీసుకోకుండా తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చి ఐఐటీ శిక్షణ ఇస్తూ ఇప్పటిదాకా 333 మంది పేద విద్యార్థులు ఐఐటీ పరీక్షల్లో విజయవంతమయ్యేలా చేసిన ఘనుడు ఆనంద్.

వారణాసికి చెందిన నిధి కూడా ఆనంద్ దగ్గర అలాగే సాయం, శిక్షణ పొంది ఐఐటీ పరీక్షలో విజయం సాధించింది. ప్రస్తుతం ఐఎస్ఎంలో చదువుతోంది. నిధి స్ఫూర్తి గాథ గురించి తెలుసుకున్న పాస్కల్ ప్లిసన్ అనే ఫ్రెంచ్ ఫిలిం మేకర్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ డాక్యుమెంటరీ రూపొందించాడు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నాలుగు స్ఫూర్తి గాథలతో అతను డాక్యుమెంటరీలు తీస్తున్నాడు. నిధి మీద కూడా 90 నిమిషాల సినిమా తీశాడు. అది త్వరలోనే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమవుతోంది. పాట్నాలోని ఆనంద్ కుమార్ ఇంట్లో నడుస్తున్న సూపర్ 30 ఇన్ స్టిట్యూట్లో.. నిధి సొంతూరిలో ఈ డాక్యుమెంటరీ చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘నిధి విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఆమెది చాలా పేద కుటుంబం. ఎంతో పట్టుదలతో ఐఐటీ ప్రవేశ పరీక్షలో పాసైంది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి డాక్యుమెంటరీలో కనిపించబోతోంది. తను మా కుటుంబ సభ్యురాల్లాంటిది. మా అమ్మ పక్కలో పడుకునేది. కష్టపడి చదివేది. దానికి ఫలితం దక్కింది’’ అన్నాడు.
Tags:    

Similar News