‘భాగమతి’ ఆ టైపు సినిమా కాదట

Update: 2018-01-25 05:36 GMT
భాగమతి సినిమా అందరూ అనుకుంటున్నట్లు లేడీ ఓరియెంటెడ్ సినిమా కాదని.. సినిమా చూస్తుంటే ఆ భావనే కలగదని అంటున్నాడు దర్శకుడు జి.అశోక్. ‘భాగమతి’లో అనుష్క పాత్ర కంటే మించిన హైలైట్లు చాలా ఉన్నాయని.. అన్నిటికంటే పెద్ద ఆకర్షణ స్క్రీన్ ప్లేనే అని అశోక్ అన్నాడు. ‘‘ముందుగా ఒక విషయం స్పష్టం చేస్తున్నా. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా కాదు. ‘భాగమతి’ని ఆ కోణంలో చూడకండి. ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. అదే సినిమాకు అతి పెద్ద బలం. ఈ చిత్రంలో సాంకేతిక విభాగాలు కూడా ఒక్కో క్యారెక్టర్ లాగా కనిపిస్తాయి. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ అద్భుత నైపుణ్యంతో తీర్చిదిద్దిన బంగ్లా ఇందులో ఒక పాత్ర లాగా కనిపిస్తుంది. 70 శాతం కథ ఆ బంగ్లా చుట్టూనే తిరుగుతుంది. దాన్ని ఒక క్యారెక్టర్ లాగా ఫీలవుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆకర్షణలున్నాయి’’ అని అశోక్ తెలిపాడు.

‘భాగమతి’ కోసం తాను ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నట్లు అశోక్ తెలిపాడు. ‘‘నా తొలి సినిమా ‘పిల్ల జమీందార్’ విడుదలవ్వగానే చేయాల్సిన సినిమా ‘భాగమతి’. యువి క్రియేషన్స్ వాళ్లతో ‘మిర్చి’ రోజుల నుంచి ప్రయాణిస్తున్నా. కథ నచ్చినప్పటికీ అనుకున్న సమయానికి సినిమా మొదలు కాలేదు. అనుష్క ‘బాహుబలి’తో బిజీగా ఉండటంతో వెంటనే ఈ సినిమా చేయలేకపోయింది. ఆమెతోనే చేయాలని పట్టుదలతో ఉన్నాను. మధ్యలో రెండుసార్లు మొదలుపెడదామనుకుని ప్రయత్నించినా వీలు కాలేదు. షూటింగ్ కూడా ఆలస్యమైంది. అందుకే సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఐతే ఇదొక యూనివర్శల్ సబ్జెక్టుతో తెరకెక్కిన సినిమా. బాగా తీశాం. ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాం’’ అని అశోక్ అన్నాడు.
Tags:    

Similar News