కొత్త హీరో.. అసలు డిస్కషనే లేదు పాపం

Update: 2017-07-04 11:37 GMT
ఇంతకుముందు సినీ రంగానికి చెందిన వారసులు మాత్రమే సినిమాల్లోకి వచ్చేవాళ్లు. కానీ ఈ మధ్య రాజకీయ నాయకుల వారసులు కూడా సినీ రంగం వైపు చూస్తున్నారు. నారా రోహిత్ ఈ కోవలోనే సినిమాల్లోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. ఐతే అతను హీరోయిజం గురించి.. మాస్ ఇమేజ్ గురించి ఆలోచించకుండా కథలకే ప్రాధాన్యం ఇస్తూ.. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. సినీ రంగం నుంచి వచ్చే వారసులకు కూడా నారా రోహిత్ ఈ విషయంలో స్ఫూర్తిగా నిలిచాడనడంలో సందేహం లేదు. ఐతే గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి మాత్రం సరైన గైడెన్స్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టి తొలి ప్రయత్నంలో గట్టి ఎదురు దెబ్బే తిన్నాడు.

తమిళంలో విజయ్ సేతుపతి లాంటి గొప్ప నటుడు పోషించిన పవర్ ఫుల్ పోలీస్ పాత్రను తెలుగులో తన తొలి సినిమాతోనే చేయాలనుకోవడం గంటా రవి చేసిన పెద్ద తప్పు. ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలకే కష్టమైన ఈ పాత్రను గంటా రవి మోయలేకపోయాడు. గత శుక్రవారం రిలీజైన ‘జయదేవ్’ దారుణమైన ఫలితాన్నందుకుంది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రాన్ని పూర్తిగా తిరస్కారం ఎదురైంది. విచారకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా గురించి ఎక్కడా పెద్ద చర్చ కూడా లేదు. సోషల్ మీడియాతో పాటు ఏ రకమైన మీడియా కూడా ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. గంటా రవి ఎలా చేశాడన్న డిస్కషన్ కూడా ఎక్కడా లేదు. సినిమా వచ్చిన సంగతే జనాలకు తెలియట్లేదు. మంచో చెడో.. ఓ సినిమా విడుదలైనపుడు దాని గురించి కొంత చర్చ జరగడం అవసరం. కానీ ‘జయదేవ్’ అందుకు నోచుకోలేకపోయింది. మీడియాతో పాటు జనాల దృష్టిని ఆకర్షించలేకపోయింది. చాలా పెద్ద పొలిటికల్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి.. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలతో ప్రమోట్ చేయించినా గంటా రవికి ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఆశ్చర్యమే. తొలి సినిమాతో చేదు అనుభవం ఎదుర్కొన్న ఈ కుర్రాడు.. ‘జయదేవ్’ తర్వాత ఏం చేస్తాడో చూడాలి.


Tags:    

Similar News