గరికపాటి Vs చిరంజీవి: ఏదో మూడ్‌ లో అలా అని ఉంటారని వదిలేస్తే మంచిది..!

Update: 2022-10-10 09:30 GMT
అలయ్ బలయ్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి మరియు ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మధ్య వివాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి ఫోటో సెషన్‌ ను ఆపకుంటే అక్కడి నుంచి వెళ్లిపోతానని గరికిపాటి అసహనం వ్యక్తం చేయగా.. చిరు మాత్రం ఎలాంటి కోపతాపాలకు పోకుండా వినయ విధేయతలు ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు.

అయితే చిరంజీవి ని ఉద్దేశిస్తూ గరికపాటి అలా మాట్లాడటంపై మెగా అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రవచనకర్త ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో నెగెటివ్ పోస్టులతో హోరెత్తించారు. ఇలాంటి టైంలో మెగా బ్రదర్ నాగబాబు సెటైరికల్ ట్వీట్ చేయడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. అయితే ఈ విషయాన్ని గ్రహించి వివాదం పెద్దది కాకూడదని అనుకున్నాడేమో.. మెగా ఫ్యాన్స్ ఎవరూ తప్పుగా మాట్లాడవద్దంటూ వారిని శాంతింపజేయడానికి మరో ట్వీట్ చేసాడు.

ఇక్కడితో గరికపాటి Vs చిరంజీవి వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ భావించగా.. 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్ మళ్లీ నిప్పు రాజేసింది. గ్రాండ్ గా జరిగిన ఈ ఈవెంట్ లో కొంతమంది నటులు టెక్నీషియన్స్ ఓవైపు మెగాస్టార్ ను పొగుడుతూ.. మరోవైపు గరికపాటి మీద మండిపడ్డారు. సినిమా గురించి మాట్లాడటానికి కాకుండా గరికపాటిని టార్గెట్ చేయడానికి ఈ వేదికను ఉపయోగించుకున్నారు.

సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు మాట్లాడుతూ.. ఆయన మీద అభిమానంతో ఫోటోలు తీసుకుంటున్నాం. మాట్లాడేవాడు మహా పండితుడు.. ఆయన అలా మాట్లాడవచ్చా అండి.. అది తప్పు కదా.. అలాంటి వాడిని కూడా చిరంజీవి గారు ఇంటికి ఆహ్వానించారు.. అది కదా సంస్కారం.. ఇది కదా మనం నేర్చుకుంటున్నాం అని అన్నారు. అలానే గీత రచయిత అనంత శ్రీరామ్ కూడా గరికపాటి ని గరికతో పోల్చుతూ సెటైర్లు వేశారు.

ఎప్పుడూ ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళని డైరెక్టర్ బాబీ సైతం గరికపాటి ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. ప్రస్తుతం తాను డైరెక్ట్ చేస్తున్న హీరోని అగౌరవ పరిచారని భావించాడేమో.. ఇటీవల జరిగిన ఇన్సిడెంట్ ని ప్రస్తావిస్తూ 'ఎవడు పడితే వాడు మాటి మాటికీ.. సరిసాటి లేనివాళ్ళు కూడా మాట్లాడుతుంటే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు' అని బాబీ వ్యాఖ్యానించారు.

అయితే గరికపాటి లాంటి పండితుడు ని పట్టుకుని 'వాడు.. వీడు' అని సంబోధించడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తన ప్రవచనాలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన గరికపాటికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురష్కారం ఇచ్చి సత్కరించిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తిపై ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడటం సరైంది కాదని అంటున్నారు.

ఇక్కడ గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలను సమర్ధించడం లేదు కానీ.. ఏ వక్త అయినా స్టేజీ మీద మాట్లాడున్నప్పుడు ఇబ్బంది కలిగితే అసహనం వ్యక్తం చేయడం మామూలే. సినిమా వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో చిరాకు పడుతుంటారు. చిరంజీవి సైతం కొన్నిసార్లు అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

'స్టేజీ మీదున్నప్పుడు డిస్టర్బ్ చేస్తావేంటి? ఎన్నిసార్లు దండం పెడతావ్? నేను చూసినప్పుడల్లా ప్రతీసారి చెయ్యి పైకి ఎత్తుతున్నావ్. ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తావ్. స్టుపిడ్ ఫెలోస్' అని చిరు ఓ సినిమా ఫంక్షన్ అనంతరం ఓ అభిమానిని ఉద్దేశిస్తూ మాట్లాడటం అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

అయితే గరికపాటి కూడా తనకు ఇబ్బంది కలుగుతోందనే విషయాన్ని మైక్ లో చెప్పకుండా.. నిర్వాహకులకు లేదా చిరంజీవి కి చాలా సున్నితంగా చెప్పి ఉండాల్సింది. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదనేది అర్థమవుతుంది. అందులోనూ చిరు - గరికపాటి ఇద్దరూ కూడా తమ తమ రంగాల్లో దిగ్గజాలుగా రాణిస్తున్నారు. ఒకే స్టేజీని పంచుకున్న వీరిద్దరిలో ఒకరు ఎక్కువని కాదు.. ఒకరు తక్కువని కాదు.

వాస్తవానికి చిరంజీవి సైతం ఆ ఘటన తర్వాత గరికపాటి తో వినయపూర్వకంగా వ్యవహరించి అందరి మన్ననలు అందుకున్నారు. కానీ కొందరు సినీ ప్రముఖులు 'గాడ్ ఫాదర్' ఈవెంట్ లో అదో పనిగా పెట్టుకుని గరికపాటి ని టార్గెట్ చేయడం వల్ల.. ఇదేదో చిరంజీవి దగ్గరుండి మాట్లాడించారనే విధంగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

నాగబాబు ట్వీట్ చేసినట్లు ఇప్పటికైనా 'గరికపాటి వారు ఏదో మూడ్‌ లో అలా అని ఉంటారు' అనుకుని.. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే బాగుంటుందని నెట్టింట అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News