మెగా 'రిపబ్లిక్‌' పై సుప్రీంకు వెళ్తారట

Update: 2021-10-06 06:30 GMT
సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌ గా జగపతిబాబు.. రమ్యకృష్ణ లు కీలక పాత్రల్లో విలక్షణ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రేక్షకుల నుండి కూడా మిశ్రమ స్పందన వస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందిన రిపబ్లిక్ మూవీ విడుదలకు ముందు వరకు చాలా హడావుడి చేయడం జరిగింది. విడుదల తర్వాత కూడా హడావుడి కంటిన్యూ అవుతోంది. విడుదలైన వారం కాబోతున్న నేపథ్యంలో వసూళ్ల విషయంలో చర్చ జరుగుతోంది. చిత్ర యూనిట్‌ సభ్యుల వారు చెబుతున్న దాని ప్రకారం ఆశించిన దాని కంటే కాస్త ఎక్కువగానే వసూళ్లు నమోదు అయ్యాయట. ఈ సినిమా సక్సెస్‌ వేడుక నిర్వహించుకోవాలని భావించినా కూడా సాయి ధరమ్‌ తేజ్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అందుకే ఆయన కోలుకున్న తర్వాత సక్సెస్ వేడుక చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. తేజ్‌ పూర్తి ఆరోగ్యంతో వచ్చిన సమయంలో వేడుక నిర్వహిస్తామని నిర్మాతలు చెబుతున్నారు.

రిపబ్లిక్ సినిమా లో రాజకీయ అంశాలతో పాటు కొన్ని సమాజంలో జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా సినిమాలో కొల్లేరు ను తప్పుడుగా చూపించారు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కొల్లేరు ప్రాంతంకు చెందిన వారు ఆ సన్నివేశాలను తొలగించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. సినిమాలో కొల్లేరు పేరు వాడకుండా మరో పేరు వాడారు. అయినా కూడా అది అందరికి కొల్లేరు అని అర్థం అవుతుందని.. తద్వారా కొల్లేరు పరిసర ప్రాంతాల వారి మనోభావాలను దెబ్బ తీసినట్లు అవుతుందని ఈ సందర్బంగా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కొల్లేరు అనేది కాలుష్యంకు నెలవుగా మారిందని.. కొల్లేరు లోని చెపలను విషం పెట్టి పెంచుతున్నారు అంటూ సినిమాలో చూపించడంను తప్పుబడుతున్నారు. కొల్లేరు చేపల వ్యాపారంపై దెబ్బ తీసే విధంగా ఆ సన్నివేశాలు ఉన్న కారణంగా వెంటనే వాటిని తొలగించాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఒక వేళ సన్నివేశాలను తొలగించకుంటే మాత్రం అతి త్వరలోనే సుప్రీం కోర్టుకు వెళ్లి అక్కడ రిపబ్లిక్ మూవీ పై తేల్చుకుంటామని కొల్లేరు పరివాహక ప్రాంతానికి చెందిన ప్రజల నాయకులు హెచ్చరిస్తున్నారు. సినిమా విడుదల అయ్యి వారం అవుతుంది.. మరో వారం రోజుల్లో సినిమా థియేటర్లలో ఉంటుందో లేదో తెలియదు.. ఇలాంటి సమయంలో ఎందుకు ఈ రచ్చ అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేది చూడాలి.



Tags:    

Similar News