150 టికెట్.. 200 అయింది

Update: 2017-06-29 07:45 GMT
జీఎస్టీతో జరిగే మేలు ప్రత్యక్షంగా కనిపించకపోయినా.. పరోక్షంగా అంతా మంచే అంటోంది మోడీ సర్కారు. కానీ పరోక్షంగా ఏం జరుగుతుందో ఏమో కానీ.. ప్రత్యక్షంగా పెరిగిపోతున్న ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నాడు సామాన్యుడు. ఇప్పటికే సినిమా వినోదం ఖరీదైపోయిందని.. కుటుంబంతో కలిసి మంచి క్వాలిటీ ఉండే మల్టీప్లెక్సులో ఒక సినిమా చూసి రావాలంటే వెయ్యి రూపాయలు లేచిపోతున్నాయని ఆందోళన చెందుతున్నాడు సగటు ప్రేక్షకుడు. ఇప్పుడు అతడిని మరింత వెనక్కి లాగేలా చేస్తున్నాయి పెరుగుతున్న టికెట్ ధరలు. మల్టీప్లెక్సుల్లో ఇప్పటికే మినిమం రూ.150గా ఉన్న టికెట్ ఇప్పుడు జీఎస్టీ దెబ్బకు ఒక్కసారిగా రూ.200కు చేరుకున్నాయి.

హైదరాబాద్ లో ప్రముఖ మల్టీప్లెక్స్ అయిన ప్రసాద్స్.. మిగతా వాటి కంటే ముందుగా జీఎస్టీ తర్వాత టికెట్ల రేట్లు ఎలా పెంచబోతున్నామో ప్రకటించింది. ఈ శనివారం నుంచే కొత్త రేట్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. ఇప్పటిదాకా సాధారణ మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.150 ఉండగా.. దాన్ని రూ.200కు పెంచారు. ఐమాక్స్ స్క్రీన్లో టికెట్ ధర రూ.250 నుంచి రూ.300కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ శుక్రవారంతో పాత రేట్లకు సెలవిచ్చేయనున్నారు. హైదరాబాద్ లోని మిగతా మల్టీప్లెక్సులన్నీ కూడా ఇదే తరహాలో రేట్లు పెంచబోతున్నట్లు తెలుస్తోంది. సింగిల్ స్క్రీన్లలో కూడా ఇదే రేషియోలో టికెట్ల ధరలు పెరగనున్నాయి. ఈ ధరల పెంపు చిన్న సినీ రంగానికి చేటు చేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కష్టాల్లో ఉన్న చిన్న సినిమాలకు ఈ పరిణామం పెద్ద ఎదురు దెబ్బే అయ్యేలా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News