ప్రేమ మాయాజాలాన్ని వ్యాప్తి చేసే 'గుర్తుందా శీతాకాలం'

Update: 2022-02-14 05:57 GMT
స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా - టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ జంటగా నటించిన తాజా ప్రేమకథా చిత్రం ''గుర్తుందా శీతాకాలం''. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మేఘా ఆకాష్ - కావ్య శెట్టి వంటి మరో ఇద్దరు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ''గుర్తుందా శీతాకాలం'' ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. 'శీతాకాలం.. మంచులో మనసులు తడిసి ముద్దయ్యే కాలం.. చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం.. నా లైఫ్ లో శీతాకాలానికి ఇంకో పేరుంది.. సీజన్ ఆఫ్ మ్యాజికల్.. మనసుతో ప్రేమించాలంటే ముందుగా కళ్ళతో చూడాలి కదా?' అంటూ సత్యదేవ్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం అలరిస్తూ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.

కళ్ళకి నచ్చిన ప్రతీ అమ్మాయినీ తానే లైఫ్ పార్ట్నర్ అనుకునే దేవ్.. టీనేజ్ నుంచి కాలేజీ రోజులు మరియు యవ్వన దశ వచ్చే వరకు నలుగురు అమ్మాయిలను ప్రేమించినట్లు కనిపిస్తోంది. కోమలి - అమ్ము (కావ్య శెట్టి) - దివ్య (మేఘా ఆకాష్) లతో చూడగానే లవ్ లో పడిన దేవ్.. నిధి (తమన్నా) అనే అమ్మాయిని చూడగానే ప్రేమలో పడలేదు కానీ.. తనకు తెలియంది ఏదో జరిగిందని చెబుతున్నాడు.

శీతాకాలం వచ్చిన ప్రతీసారి ఎవరో ఒకరితో ప్రేమలో పడిపోయే దేవ్.. వీరిలో ఎవరిని తన లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకున్నాడనేది 'గుర్తుందా శీతాకాలం' సినిమా కథాంశంని తెలుస్తోంది. యువ సంగీత దర్శకుడు కాలభైరవ సమకూర్చిన నేపథ్య సంగీతం.. సత్యా హెగ్డే సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. లక్ష్మీభూపాల్ ఈ సినిమాలో డైలాగ్స్ రాశారు.

'గుర్తుందా శీతాకాలం' చిత్రాన్ని నాగ‌శేఖ‌ర్ మూవీస్ - శ్రీ వేదాక్షర మూవీస్ - మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రూపొందిస్తున్నారు. చిన బాబు - ఎంఎస్ రెడ్డి సమర్పణలో భావ‌న‌ ర‌వి - నాగశేఖర్ - రామారావు చింతపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేసారు. మేకర్స్ త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.


Full View
Tags:    

Similar News