`అందాల రాక్ష‌సి`కి మూడింత‌లు?

Update: 2018-12-05 01:30 GMT
ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో శైలి ఉంటుంది. న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌ పై సీనియ‌ర్ ద‌ర్శ‌కుల ప్ర‌భావం ఎంతో ఉంటుంది. తాము ఏ ద‌ర్శ‌కుడిని స్ఫూర్తి గా తీసుకుని, విప‌రీతంగా అభిమానించి సినిమాలు తీస్తారో ఆ ద‌ర్శ‌కుడి శైలి త‌మ‌ సినిమాల్లో ప్ర‌తిబింబిస్తుంటుంది. `అందాల రాక్ష‌సి` సినిమా తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగు వేసి, ఆరంభ‌మే ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి లాంటి టాప్ డైరెక్ట‌ర్ మెప్పు పొందాడు హ‌ను రాఘ‌వపూడి. ``విష‌యం ఉన్న సినిమా తీశాడు. ఈ యువ‌ద‌ర్శ‌కుడి లో మ్యాట‌ర్ ఉంది`` అంటూ జ‌క్క‌న్న కితాబిచ్చారు అప్ప‌ట్లోనే.

అందుకు త‌గ్గ‌ట్టే  ఉద్విగ్న‌ భ‌రిత‌మైన ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌ను తెర‌పై ఆవిష్క‌రించాడు హ‌ను. త‌న ఫేవ‌రెట్ డైరెక్ట‌ర్‌ మ‌ణిర‌త్నం ప్ర‌భావంతో రాహుల్ ర‌వీంద్ర‌న్ పాత్ర‌ను క్రియేట్ చేసి త‌ప్పు చేసినా, న‌వీన్ చంద్ర పాత్ర‌ను తీర్చిదిద్దిన తీరు, క‌థానాయిక అందాన్ని, లొకేష‌న్స్ బ్యూటీని చూపించిన తీరు ప్ర‌తిదీ యూత్‌కి బాగా నచ్చేశాయి. హ‌ను మంచి ర‌చ‌యిత‌గానూ ఆక‌ట్టుకున్నాడు. సంభాష‌ణా చాతుర్యం చూపించాడు తొలి సినిమాలో. ముఖ్యంగా ప్రేమ‌క‌థ‌ను న‌డిపించడంలో గ్రిప్ ఉన్న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు. సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఫెయిలైనా త‌న పేరును చెడ‌గొట్ట‌లేదు. ఆ త‌ర్వాత అంతే క‌సిగా తీసిన `కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ` అత‌డి అవ‌కాశాల్ని పెంచింది.  అందాల రాక్ష‌సి బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైనా, రెండో సినిమా స‌క్సెసై అత‌డిని నిల‌బెట్టింది.

అదే కాన్ఫిడెన్స్‌తో నితిన్ హీరోగా `లై` అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మూడో ఛాన్స్ చాలా పెద్ద అవ‌కాశ‌మే. యాక్ష‌న్ హీరో అర్జున్‌ని విల‌న్‌ని చేసి ఇంటెలెక్చువ‌ల్‌ మైండ్ గేమ్ నేప‌థ్యంలో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో `లై` చిత్రాన్ని తెర‌కెక్కించాడు. చిన్న‌పాటి త‌ప్పిదాల‌తో తీవ్ర‌మైన మూల్యం చెల్లించుకోవాల్సొచ్చింది మ‌రోసారి. అందాల రాక్ష‌సి విష‌యంలో చేసిన చిన్న‌పాటి త‌ప్పిద‌మే `లై` సినిమా విష‌యంలోనూ చేశాడ‌ని విశ్లేషించారు క్రిటిక్స్. అయితే త‌ప్పులను విశ్లేషించుకుని ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మ‌రో ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈసారి వ‌రుస విజ‌యాల‌తో ఊపుమీదున్న‌ శ‌ర్వానంద్ హీరోగా, కిక్కిచ్చే సినిమాల‌తో హాట్ ఫేవ‌రెట్‌గా మారిన సాయి ప‌ల్ల‌వి నాయిక‌గా `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి పోస్ట‌ర్లు, తొలి టీజ‌ర్ నుంచి అద్భుత‌మైన క్రేజు తేవ‌డంలో స‌క్సెస‌య్యాడు. హ‌ను మ‌రోసారి త‌న‌దైన మార్క్‌తో డీప్ ఇంటెన్స్ ల‌వ్‌స్టోరిని ప్రేక్ష‌కుల ముందుకు తెస్తున్నాడ‌ని అర్థ‌మైంది. శ‌ర్వా- సాయిప‌ల్ల‌వి జంట మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వ‌ర్క‌వుటైంద‌ని పోస్ట‌ర్లు, విడుద‌లైన సాంగ్ చెప్పాయి. అస‌లింత‌కీ ఈసారి తీస్తున్న సినిమా క‌థేంటి? అంటే.. హ‌ను మ‌రోసారి ఎక్స్‌ట్రీమ్ ల‌వ్‌స్టోరీనే ఎంచుకున్నాడ‌ట‌.  ఎక్స్‌ట్రీమ్ టేకింగ్‌ని చూపిస్తున్నాడ‌ట‌.  హీరో- హీరోయిన్ పెయిర్ మ‌ధ్య కెమిస్ట్రీ డీప్ ఇంటెన్సిటీ ఆక‌ట్టుకుంటుంద‌ట‌. `అందాల రాక్ష‌సి`ని మించి మూడు రెట్లు ఇంటెన్స్ స్టోరిని ఎంచుకుని తీస్తున్నాడని చిత్ర‌యూనిట్ చెబుతోంది. హ‌ను రాఘ‌వ‌పూడి ట్యాలెంటెడ్ అన‌డంలో సందేహం లేదు. మ‌రోసారి ఈ సినిమాతో హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా? అన్న‌ది చూడాలి. శ‌ర్వా, సాయిప‌ల్ల‌విల స‌క్సెస్ ట్రాక్ అత‌డికి పెద్ద ప్ల‌స్ కానుంది. డిసెంబ‌ర్ 21న ఈ చిత్రం రిలీజ‌వుతోంది. ఫేట్ డిసైడ్ అయ్యే కీల‌క‌మైన రోజు అది.
Tags:    

Similar News