పవర్ స్టార్ అంటే అంతే మరి

Update: 2018-09-02 09:53 GMT
మామూలుగా ఎంత పెద్ద హీరో అయినా తాను ఇకపై సినిమాలు చేయను కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతాను అని చెప్పినప్పుడు ఎంతో కొంత ఆ చర్య తాలూకు ప్రభావం ఫాలోయింగ్ మీద పడుతుంది. ఎలాగూ వెండితెరపై చూడలేం కాబట్టి వేరే వాళ్లకు షిఫ్ట్ అయిపోదాం అనుకునేవాళ్లు ఉండకపోరు. కానీ మెగా హీరోలు మాత్రం దీనికి భిన్నం అని ఎప్పటికప్పుడు ఋజువు చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య ఎనిమిదేళ్ల విరామం తీసుకుని పాలిటిక్స్ నుంచి తిరిగి వచ్చి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చేస్తే ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే అయితే నిన్న రాత్రి నుంచే సోషల్ మీడియా హోరెత్తిపోవడం చూస్తే పవన్ మేనియాకు కళ్ళు బైర్లు కమ్మక మానవు. కరెక్ట్ గా చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు గడవకుండానే పది మిలియన్ల దాకా ట్వీట్లను విషెస్ రూపంలో తెచ్చుకోవడం అంటే చిన్న విషయమా. ఇవి కాకుండా ఫేస్ బుక్ లో ఆనందాన్ని పంచుకున్న వారి లెక్కలు తెలిసే అవకాశం లేదు కానీ ఆ సంఖ్య కూడా మిలియన్లలోనే ఉంది.  ఇందులో సైతం పవన్ కొత్త రికార్డులు సెట్ చేస్తున్నాడు.

మరోవైపు తన తోటి నటీనటులు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి పవన్ మీద శుభాకాంక్షలు వెల్లువ కొనసాగుతూనే ఉంది. ట్వీట్లలో అందరు తడిసి ముద్ద చేస్తున్నారు. రామ్ చరణ్ ఇచ్చిన స్పెషల్ వీడియో గిఫ్ట్ ఇప్పటికే విపరీతంగా వైరల్ గా మారి చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. విష్ చేయని వారు ఎవరా అని చూస్తే పేర్లు దొరకడం కష్టంగానే ఉంది. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పిన పవన్ కళ్యాణ్ పై అభిమానులు అంతే ప్రేమను కొనసాగించడం చూస్తే భవిష్యత్తులో అప్పుడప్పుడు అయినా రీ ఎంట్రీ ఇచ్చి ఒకటో రెండో సినిమాలు చేస్తే బాగుంటుంది అన్న వాళ్ళ కోరిక సబబే అనిపిస్తుంది. జనసేన కార్యకలాపాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంకా ఎవరి విషెస్ కు అధికారికంగా స్పందించలేదు.
Tags:    

Similar News