గాన గంధర్వుడి జయంతికి టాలీవుడ్ స్వరనీరాజనం..!

Update: 2021-06-03 17:30 GMT
గాన గంధర్వుడు, లెజండరీ సింగర్ ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల కరోనా బారినపడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన 75వ జయంతిని పురస్కరించుకొని ఘన నివాళి అందించడానికి తెలుగు చిత్ర పరిశ్రమ సన్నాహాలు చేస్తోంది. బాలు పుట్టినరోజైన జూన్ 4న 'స్వరనీరాజనం' పేరుతో మ్యూజికల్ ఈవెంట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జూన్‌ 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ 12 గంటల పాటు ఆన్ లైన్ లో ఈ మ్యూజికల్ ఈవెంట్ జరగనుంది. ఇందులో సంగీత దర్శకులు - పాటల రచయితలు - గాయనీ గాయకులు - మా అసోసియేషన్ - డైరెక్టర్స్ అసోసియేషన్ - టాలీవుడ్ నిర్మాతలు - బాలసుబ్రహ్మణ్యం తో అనుభవం ఉన్న సినీ ప్రముఖులు.. ఇలా సినీరంగానికి చెందిన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ విషయాన్ని తెలుపుతూ.. నాన్ స్టాప్‌ గా జరిగే ఈ లైవ్ ఈవెంట్ ని అందరూ చూసి, జయప్రదం చేయాల్సిందిగా కోరారు. కాగా, కొన్నేళ్ల పాటు తన గాత్రంతో ప్రేక్షకులను అలరించిన బాలు మరణం యావత్ చిత్ర ప‌రిశ్ర‌మను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. భారతీయ సినిమాకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆయన జయంతి నాడు టాలీవుడ్ ఘన నివాళి అర్పించబోతోంది.
Tags:    

Similar News