చాలా రోజుల తరువాత వస్తున్న పండగ .. 'వకీల్ సాబ్': హరీశ్ శంకర్

Update: 2021-04-05 03:01 GMT
పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలనే ఆశ .. ఆశయం చాలామంది దర్శకులకు ఉంటుంది. ఆయనతో ఒక సినిమా చేసిన వాళ్లు ఆ స్నేహాన్ని అంత త్వరగా మరిచిపోలేరు. అందువల్లనే ఆయన ఏ సినిమా చేసినా వాళ్లంతా కూడా ఆ సినిమా ఆయనకి భారీ విజయాన్ని తెచ్చిపెట్టాలని భావిస్తుంటారు. ఆయన సినిమా వేడుకలలో సంతోషంతో సందడి చేస్తుంటారు. అలా 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా పవన్ తో సాన్నిహిత్యం ఉన్న దర్శకులు హాజరయ్యారు. రీ ఎంట్రీ సినిమాగా ఆయన చేసిన 'వకీల్ సాబ్' అనూహ్యమైన విజయాన్ని సాధించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

గతంలో పవన్ కల్యాణ్ కి 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్, త్వరలో ఆయనతో మరో సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. 'వకీల్ సాబ్' వేదికపై హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. "చాలా రోజుల తరువాత వస్తున్న పండగ మనకి .. అందుకే మనందరి తరఫున పవన్ కల్యాణ్ గారికి వెల్ కమ్ బ్యాక్ చెబుతున్నాను. లాక్ డౌన్ తరువాత చిత్రపరిశ్రమ కుదేలైపోయింది. అలాంటి పరిస్థితుల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ, కొన్ని వేలమంది సినీ కార్మికులకు ఉపాధిని కలిగించే దిశగా అడుగులు వేసిన పవన్ కల్యాన్ గారికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను.

కల్యాణ్ గారు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు .. మన ఫ్యామిలీ అంటే, కేవలం మన ఫ్యామిలీ అని కాదు .. సినిమా ఇండస్ట్రీ అంతా మన ఫ్యామిలీనే అని. ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక సినిమా హిట్ అయితే ఫస్టు సంతోషించేది ఆయనే. అది ఏ సినిమా .. ఎవరి సినిమా అనే విషయాలతో ఆయనకి పని లేదు. ఆయన .. సినిమాలను వదిలేద్దామని అనుకున్నా, సినిమా ఆయనను వదలదు. మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. 'తొలిప్రేమ' 100వ రోజు .. ఆ సందర్భంగా సంధ్య70MM .. సంధ్య 35 MMలలో షోస్ వేయాలని డిస్ట్రీబ్యూటర్ గారు ప్లాన్ చేశారు.

ఆ థియేటర్ల దగ్గర గుంపులో ఓ కాలేజ్ కుర్రాడు పవన్ గారి కటౌట్ చూస్తూ నుంచున్నాడు. ఎప్పటికైనా డైరెక్టర్ గా పవన్ తో సినిమా చేయాలని ఆ కుర్రాడు అనుకున్నాడు. అక్కడికి కాస్త దూరంలో ఉన్న ఓ డిస్ట్రిబ్యూటర్ కూడా ప్రొడ్యూసర్ గా మారిన తరువాత పవన్ తో ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ కుర్రాడు కొన్ని సంవత్సరాల తరువాత పవన్ తో 'గబ్బర్ సింగ్' తీశాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ .. ప్రొడ్యూసర్ గా మారిపోయి పవన్ తో 'వకీల్ సాబ్' తీశాడు .. అంటూ ముందువరుసలో కూర్చున్న 'దిల్' రాజు వైపు చూస్తూ, ఆయన సంకల్ప బలానికి హరీశ్ శంకర్ హ్యాట్సాఫ్ చెప్పాడు. 
Tags:    

Similar News