ర‌ష్మిక మంద‌న్న‌కు ఇది కూడా షాకిచ్చిన‌ట్టేనా?

Update: 2023-01-21 05:37 GMT
సౌత్ నుంచి నార్త్ కి వెళ్లిన వాళ్ల‌లో శ్రీ‌దేవి, రేఖ త‌రువాత అంత‌గా రాణించిన హీరోయిన్ లు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. కార‌ణం ఆ స్థాయిలో వారు న‌టించిన సినిమాలు నార్త్ లో మ‌రీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఆక‌ట్టుకోలేక‌పోతున్నాయి. ద‌క్షిణాదిలో హీరోయిన్ లుగా మంచి పేరుతో పాటు క్రేజ్ ని ద‌క్కించుకున్న హీరోయిన్ లు బాలీవుడ్ లో జెండా ఎగ‌రేయాల‌ని, అక్క‌డి సినిమాల్లో త‌మ స‌త్తాని చాటుకోవాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అంద‌రిలాగే నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న కూడా బాలీవుడ్ లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ద‌క్షిణాదిలో మ‌రీ ముఖ్యంగా తెలుగులో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక మంద‌న్న గ‌త ఏడాది బాలీవుడ్ బాట ప‌ట్టిన విష‌యం తెలిసిందే. తొలి ఆఫ‌ర్ ని 'మిష‌న్ మ‌జ్ను' మూవీతో ద‌క్కించుకుంది. అయితే అనేక కార‌ణాల వ‌ల్ల ఈ మూవీ ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. దీంతో త‌ను ఆ త‌రువాత అంగీక‌రించిన సినిమాలు విడుద‌లైంది.

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్య‌చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించిన మూవీ 'గుడ్ బై'. ఇందులో ర‌ష్మిక ..బిగ్ బి కి కూతురిగా న‌టించింది. మ‌లి ప్ర‌య‌త్న‌మే క్రేజీ కాంబినేష‌న్ లో న‌టించే అవ‌కాశం రావ‌డంతో దీంతో త‌న కెరీర్ బాలీవుడ్ లో మ‌లుపు తిరుగుతుంద‌ని భావించింది. అయితే ర‌ష్మిక భారీ అంచ‌నాలు పెట్టుకున్న‌ ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లాప‌డి త‌న ఆశ‌ల‌ని ఆవిరి చేసింది. అమితాబ్ తో క‌లిసి న‌టించిన తొలి సినిమా ఇలా ఫ్లాప్ కావ‌డంతో షాక్ కు గురైన ర‌ష్మిక 'మిష‌న్ మ‌జ్ను'తో అయినా స‌క్సెస్ వ‌స్తుంద‌ని ఆశించింది.

వివిధ కార‌ణాల వ‌ల్ల గ‌త కొంత కాలంగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీకి నెట్ ఫ్లిక్స్ వారు భారీ ఆఫర్ ఇవ్వ‌డంతో టెమ్ట్ యిన మేక‌ర్స్ ఈ మూవీని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌కుండా నేరుగా జ‌న‌వ‌రి 20న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. ర‌ష్మిక న‌టించిన సినిమా కావ‌డంతో ఆడియ‌న్స్ ఈ మూవీపై అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ అంచ‌నాల్ని ఈ మూవీ ఏ స్థాయిలోనూ అందుకోలేక‌పోయింది. క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా సినిమా నాసిర‌కంగా మారి షాకిచ్చింది.

1970 నేన‌ప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఇండియా పోఖ్రాన్ న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌ను జ‌రిపిన త‌రువాత పాకిస్థాన్ ఆ విష‌యాన్ని జీర్ణించుకోలేక అనుబాంబు త‌యారీకి పూనుకుంటుంది. ఆ విష‌యాన్ని ఇండియాకు చేర‌వేసే సీక్రెట్ ఏజెంట్ గా సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ప‌ని చేస్తూ వుంటాడు. హాలీవుడ్ మూవీ 'నైట్ క్రాల‌ర్‌' స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు ఈ చిత్ర క‌థ‌ని రాసుకున్నాడు. ఇప్ప‌టికే ఈ త‌ర‌హా క‌థ‌ల‌తో రాజీ, వెబ్ డ్రామా ముఖ్బీర్ లు వ‌చ్చేశామ‌యి. పోనీ వాటి తర‌హాలో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఈ మూవీని ద‌ర్శ‌కుడు న‌డిపించాడా? అంటే అదీ లేదు. అన‌వ‌స‌ర ప్రేమ క‌థ‌, పాట‌లు సినిమాని బోర్ కొట్టించాయి. వెర‌సి ఈ మూవీతో ర‌ష్మిక కు మ‌ళ్లీ చేదు అనుభ‌వ‌మే ఎదురు కావ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News