నీ జీవితంలో సినిమా తీయలేవు అన్నారుః ప్ర‌భాస్‌ ద‌ర్శ‌కుడు

Update: 2021-07-09 00:30 GMT
నీలో టాలెంట్ ఎంతైనా ఉండ‌నీగాక‌.. అది జ‌నాల‌కు తెలిసిన‌ప్పుడే దానికి విలువ‌. దాన్ని నిరూపించుకోవాలంటే ఒక వేదిక కావాలి. ఉద్యోగం, ఇత‌ర‌త్రా విష‌యాల్లోనే అకాశం ద‌క్కించుకోవ‌డం క‌ష్టం. అలాంటిది.. సినిమా వంటి రంగంలో అంటే.. అంత‌కు మించి! గాడ్ ఫాద‌ర్ లాంటి వారు ఉంటే త‌ప్ప‌.. సాధార‌ణ జ‌నాల‌కు అడుగు పెట్ట‌డం కూడా సాధ్యం కాదు. అయితే.. కొంద‌రు అసాధ్యులు మాత్రం ఎన్నోక‌ష్ట‌న‌ష్టాల‌ను అధిగ‌మించి, అవ‌మానాల‌ను భ‌రించి అక్క‌డే ఉండి తుద‌కు సాధిస్తారు. అలాంటి వారిలో ఒక‌రు యువ ద‌ర్శ‌కుడు సుజీత్‌.

కేవ‌లం 23 ఏళ్ళ వయసులో శ‌ర్వానంద్ తో 'రన్ రాజా రన్' అనే చిత్రాన్ని తీసి, ఇండ‌స్ట్రీ చూపును త‌న‌వైపు తిప్పుకున్నాడు. ఆ త‌ర్వాత ఏకంగా రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో.. అది కూడా బాహుబ‌లి వంటి చిత్రం త‌ర్వాత సినిమా తీసే ఛాన్స్ కొట్టేసి.. అంద‌రిచేతా నోరెళ్ల‌బెట్టించాడు. యంగ్ రెబల్‌ స్టార్ తో 'సాహో' తీసి ఔరా అనిపించాడు. ఈ చిత్రం తెలుగులో డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ.433 కోట్లు క‌లెక్ట్ చేసింది.

ఛార్ట‌ర్డ్ అకౌంటెంట్ చ‌దువు చ‌దివి, సినిమాల‌పై మోజుతో ఇండ‌స్ట్రీకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాడు సుజీత్‌. ఆలోచ‌న స‌రే.. అవ‌కాశం అంత ఈజీగా వ‌స్తుందా? ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన త‌ర్వాత‌గానీ మ‌నోడికి అర్థంకాలేదు. ఈ ప‌రిస్థితుల్లో వెనుదిరిగేవారు ఎంద‌రో. కానీ.. ముందుకే వెళ్తారు కొంద‌రు. వారిలో సుజీత్ ఉన్నాడు. చాలా ప్ర‌య‌త్నాలు చేశాడు. అడుగ‌డుగునా అవ‌మానాలు ఎదుర్కొన్నాడు.

ఈ వివ‌రాల‌న్నీ.. 'ఈటీవీ ప్లస్' లో ప్రసారమవుతున్న 'నీకు మాత్రమే చెప్తా' అనే షోలో వెల్లడించాడు సుజీత్. ఈ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ ప్ర‌సారం కాబోతోంది. ఇందులో హోస్ట్ గా త‌రుణ్ భాస్క‌ర్ వ్య‌వ‌హ‌రించారు. ఈ సంద‌ర్భంగా సుజీత్ త‌న జీవితానికి సంబంధించిన ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇందులో.. త‌రుణ్ భాస్క‌ర్ 'సినీ పరిశ్రమలో అవమానాన్ని భరించారా?' అని అడిగినప్పుడు, సుజీత్ సమాధానమిస్తూ.. “ కెరీర్ ప్రారంభంలో నువ్వు ఎప్పటికీ దర్శకుడిని కాలేవు అని ఒక నిర్మాత నన్ను సవాలు చేశాడు. సినిమాకు దర్శకత్వం వహించడం అంత తేలికైన పని కాదు. మంచి సినిమా తీసే టాలెంట్ నీకు లేదు'' అని అన్నటు చెప్పాడు సుజీత్.

అయితే.. ఆ మాటలు తనను బాధించలేదని, ఇంకా.. ప్రేరేపించాయని ఛాలెంజ్ ను స్వీక‌రించ‌డానికి ప్రోత్సహించాయని చెప్పాడు. అయితే.. 'రన్ రాజా ర‌న్‌' సినిమా తీసిన తర్వాత.. అదే నిర్మాత సుజీత్ కు ఫోన్ చేశాడట. ఒక‌సారి క‌ల‌వాల‌ని చెప్పి ఇంటికి ర‌మ్మ‌న్నాడ‌ట‌. దానికి సుజీత్‌..'సర్ చాలా బిజీగా ఉన్నాడు, ఇప్పుడు కలవడం కుదరదు' అని ఫోన్ పెట్టేశాడట సుజీత్.

అంతేకాదు.. తన గురించిన మరో సీక్రెట్ కూడా వెల్లడించాడు సుజీత్. నిజానికి సుజీత్ మొదట డైరెక్టర్ కావాలని రాలేదట. హీరో కావాలని వచ్చాడట. మంచి రూపు ఉండే అత‌ను.. న‌టుడిగా నిరూపించుకోవాలని అనుకున్నాడ‌ట‌. కానీ.. నువ్వు హీరో ఏంటి అని కూడా అన్నార‌ట‌. ఆ త‌ర్వాత షార్ట్ ఫిలిమ్స్ సినిమా మేకింగ్ వైపు మ‌ళ్లాడ‌ట‌. “కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన తరువాత, నేను బ్యాడ్ యాక్ట‌ర్ ను, మంచి ద‌ర్శ‌కుడిని అని గ్రహించాను”. అన్నాడు సుజీత్‌.

సుజీత్ రూపొందించిన షార్ట్స్ ఫిల్మ్ కు మంచి పేరు వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు కావ‌డానికి ముందు క‌నీసం 30 వ‌ర‌కు షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. “సుజీత్ సైన్” అనే యూట్యూబ్ ఛాన‌ల్ లో పోస్టు చేసిన షార్ట్స్ ఫిల్మ్స్ మంచి వ్యూస్ ద‌క్కించుకున్నాయి. ప‌లు చిత్రోత్సవాలలో అనేక అవార్డులను కూడా గెలుచుకున్నాడు. సుజీత్ షార్ట్ ఫిలిమ్స్ లో.. ప్రేమ ఇష్క్ కాదల్, ఇండియన్ ఐడిల్స్, యుద్ధం, తోక్కలో లవ్ స్టోరీ వంటివాటికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. సుదీప్ కెరీర్ కు సంబంధించిన ఇంకా మ‌రిన్ని వివ‌రాలు కావాలంటే.. 'నీకు మాత్ర‌మే చెప్తా' అంటున్న షో పై ఓ లుక్కేయాల్సిందే.
Tags:    

Similar News