‘హలో’ ఆడియో.. మెస్మరైజింగ్

Update: 2017-12-12 09:40 GMT
దర్శకుడికి మంచి టేస్టు ఉండి.. శ్రద్ధ పెట్టి మ్యూజిక్ చేయించుకుంటే ఔట్ పుట్ ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. అనూప్ రూబెన్స్ ను కొన్నేళ్ల కిందటి వరకు ఒక మామూలు మ్యూజిక్ డైరెక్టర్ లాగే చూసేవాళ్లం. కానీ అతడి నుంచి ‘ఇష్క్’ సినిమాకు టాప్ క్లాస్ మ్యూజిక్ చేయించున్నాడు విక్రమ్ కుమార్. అందులో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం లాగా నిలిచిపోయింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘మనం’ సినిమాకు ఆడియో ఇంకా గొప్పగా తయారైంది. అది తెలుగులో ఆల్ టైం క్లాసిక్ ఆల్బంల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇప్పుడు విక్రమ్-అనూప్ కలిసి మరోసారి మ్యాజిక్ చేశారు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన మూడో సినిమా ‘హలో’ ఆడియో కూడా టాప్ క్లాస్ అనడంలో సందేహమే లేదు.

సోల్ ఫుల్ మ్యూజిక్ అంటుంటాం కదా.. అలాంటి సంగీతమే అందించాడు ‘హలో’ సినిమాకు అనూప్. ప్రతి పాటలోనూ మంచి ఫీల్ ఉండేలా.. మనసుకు హత్తుకునేలా.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా.. చాలా కాలం గుర్తుంచుకునేలా పాటల్ని తీర్చిదిద్దాడతను. చక్కటి సాహిత్యం.. ఆర్ద్రతతో కూడిన గానం.. పాటలకు మరింత వన్నె తెచ్చాయి. అన్నింట్లోకి అనగనగా ఒక ఊరు.. అంటూ సాగే పాట ప్రత్యేకంగా అనిపిస్తుంది. ‘మనం’ సినిమాలోని కనిపెంచిన మా అమ్మకు.. తరహాలో ఈ పాటను ట్యూన్ చేశాడు అనూప్. ‘మనం’ తరహాలోనే ఈ పాటకు రెండు వెర్షన్లున్నాయి. ఒకటి చిన్న పిల్లలు పాడుకునేదైతే.. ఇంకోటి ఫిమేల్ వెర్షన్. చిన్న పిల్లల వెర్షన్ శ్రీ ధృతి పాడితే.. ఫిమేల్ వెర్షన్ ను శ్రియ ఘోషల్ ఆలపించింది. ఇద్దరూ కూడా హృదయాన్ని హత్తుకునేలా.. అద్భుతంగా ఈ పాటను ఆలపించారు.

ఇక అర్మాన్ మాలిక్ పాడిన హలో టైటిల్ సాంగ్ కూడా సూపర్బ్ అనిపిస్తుంది. ఇది మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట. యూత్ కి చాలా నచ్చేస్తుంది. హరిచరణ్ పాడిన ‘తలచి తలచి’.. అఖిల్ ఆలపించిన ‘ఏవేవో’ పాటలు కూడా మంచి ఫీల్ తో సాగాయి. ఈ ఆల్బంలో కొంచెం వీక్ అనిపించే సాంగ్ అంటే.. ‘మెరిసే మెరిసే’నే. ఆ పాట కూడా బాగాలేదని అనలేం. కానీ మిగతా పాటలతో పోలిస్తే కొంచెం మామూలుగా అనిపిస్తుంది. గిటార్.. వయొలిన్ వాయిద్యాల్ని చాలా బాగా వాడుకుంటూ మంచి ఫీల్ ఉన్న పాటలు అందించి.. తన కెరీర్లో మరో బెస్ట్ ఆల్బంగా దీన్ని తీర్చిదిద్దాడు అనూప్. అతడికిది 50వ సినిమా కావడం విశేషం. ఆ మైలరాయికి తగ్గ ఆల్బమే ‘హలో’. సినిమాకు ఈ ఆడియో పెద్ద ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News