హేమ‌ను ఇరికించారు స‌రే ఇత‌రుల సంగతేంటి?

Update: 2021-08-11 07:53 GMT
కొన్ని వ్య‌వ‌హారాలు ఇంతే. పీట‌ముడి వేసి చివ‌రికి పెద్ద‌లు త‌మ‌కేమీ అంట‌కుండా క‌థ న‌డిపించేస్తుంటారు. ఇటీవ‌ల మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) క్ర‌మ‌శిక్ష‌ణా నియ‌మావ‌ళి వ్య‌వ‌హారం అలానే ఉంద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. కొండ‌ను త‌వ్వి ఎల‌కను ప‌ట్టిన‌ట్టు.. సొర‌చేప‌ను ప‌ట్ట‌బోయి ప‌ట్టిస‌వ‌డ‌ను ప‌ట్టుకున్న‌ట్టు ఏదో ఏదో చేస్తున్న‌ట్టుగానే ఉంద‌న్న విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది.

ఇంత‌కీ `మా`లో ఏమైంది? అంటారా? మొన్న‌టికి మొన్న `మా` నిధులు దుర్వినియోగం అయ్యాయ‌ని ఆరోపించిన న‌టి హేమ‌కు క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై హేమ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆరోపిస్తే స‌రిపోదు నిరూపించాల‌న్న‌ది ఈ నోటీసులో తిర‌కాసు. అయితే తాము నిధుల దుర్వినియోగానికి పాల్ప‌డ‌లేద‌ని త‌న‌పై క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీనియ‌ర్ న‌రేష్ వివ‌ర‌ణ ఇవ్వగా అత‌డికి వంత‌పాడుతూ హేమ‌పై జీవిత రాజ‌శేఖ‌ర్ సైతం ఫైర‌య్యారు. హేమ ఆరోప‌ణ‌లు అసంబ‌ద్ధ‌మైన‌వ‌ని అన్నారు.

ఇదంతా ఒకెత్తు అనుకుంటే ఇన్నాళ్లు మీడియా ముందు బ‌రితెగించి మాట్లాడి మా అసోసియేష‌న్ ప‌రువుమ‌ర్యాదలు తీసిన ఇత‌రులు ఎవ‌రూ `మా` క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికి క‌నిపించ‌డం లేదా? పెద్ద‌ల‌కో రూలు... పిన్న‌ల‌కో రూలు ఉంటుందా? `మా`పై ఆరోపించిన వారు.. మా అంత‌ర్గ‌త లుక‌లుక‌ల్ని బ‌య‌ట‌పెట్టిన వారు క‌నిపించ‌డం లేదా? హేమ మాత్ర‌మేనా నేర‌స్తురాలు? ఇత‌రులెవ‌రూ మీడియా ముందుకు రాలేదా? గొంతు చించుకుని అర‌వ‌లేదా? అంటూ అసోసియేష‌న్ 950 మంది స‌భ్యుల్లోనూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

సినీపెద్ద‌లతో కూడుకున్న‌ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం వార‌సులే మా ప‌రువు మ‌ర్యాద‌ల‌ను మీడియా ముఖంగా మంట క‌లిపితే ఆరోజు షోకాజ్ లేదు. కానీ ఈరోజు హేమ లాంటి ప‌ట్టిస‌వ‌డ‌నే ఎందుకు ప‌ట్టిన‌ట్టు? అంటూ ఒక సెక్ష‌న్ గుస‌గుస‌గా మాట్టాడుకోవ‌డం హీటెక్కిస్తోంది. అస‌లు మీడియా స‌మావేశాలు ఏం అవ‌స‌ర‌మ‌ని ఇంత‌కుముందు `మా` అధ్య‌క్ష ప‌ద‌వుల‌కు పోటీప‌డేవాళ్లు బాహాబాహీకి దిగారు? అంటూ కొంద‌రు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎన్నిక‌ల‌కు వెళ్లే ముందు ఎవ‌రైనా స‌భ్యులు క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పాటించ‌క‌పోతే దండించాల్సిందే. దానికి చిన్నా పెద్దా అన్న రూల్ ఏమీ లేదు. ఇంత‌కుముందు క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పిన రాజ‌శేఖ‌ర్ ను మా డైరీ లాంచ్ లో సినీపెద్ద‌లు దండించారు. ప‌ద‌వి నుంచి తొల‌గించి శిక్ష‌ను అమ‌లు చేశారు. కానీ ఇటీవ‌ల మీడియా ముందుకు వ‌చ్చి గొంతు చించుకున్న ఎవ‌రికీ షోకాజ్ నోటీసులు అంద‌లేదు! అంటూ ఒక సెక్ష‌న్ బ‌లంగా వాదిస్తోంది. మ‌రి దీనికి మా అసోసియేష‌న్ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం ఏమ‌ని స‌మాధాన‌మిస్తుందో చూడాలి.

మా అసోసియేష‌న్ ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్ 12న జ‌ర‌గ‌నున్నాయ‌ని క‌థనాలొస్తున్నాయి. అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. ఈసారి ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ - మంచు విష్ణు అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్నారు. మ‌రో న‌లుగురిలో హేమ‌- జీవిత‌- సీవీఎల్ వంటి వారు రేసులో ఉన్నారు. ఇక న‌రేష్ వ‌ర్గంలోని 100 ఓట్లు కూడా ఈసారి ఎన్నిక‌ల్లో కీల‌కం కానున్నాయి. ఎవ‌రు గెలిచినా 2021-24 సీజ‌న్ కి అధ్య‌క్షుడిగా ఏల్తారు. ఈసీ క‌మిటీని ఎన్నిక ఉంటుంది. ఇన్నాళ్లు ఏకగ్రీవం అంటూ వినిపించినా.. దానికంటే ఎన్నిక‌లే బెట‌ర‌నే ఉద్ధేశం పెద్ద‌ల్లో బ‌య‌ట‌ప‌డ‌డం మొద‌లు ఎన్నిక‌ల పోరులో ఎవ‌రికి వారు రాజ‌కీయాలు చేస్తున్నారు.

ప్ర‌తిసారీ మీడియా మైక్ క‌నిపిస్తే బ‌కాసురుల్లా మీద ప‌డి మా అసోసియేష‌న్ ప‌రువు మర్యాద‌ల్ని మంట క‌లిపేవారికి కొద‌వేమీ లేదు. మేం సినీపెద్ద‌లు ఏం చెబితే అదే చేస్తాం అంటూనే ఎవ‌రికి వారు రాజ‌కీయాలు చేస్తున్నారు. గ‌డ‌బిడ‌ల‌కు తెర‌తీస్తున్నారు. ఇష్టానుసారం మాట్లాడేస్తున్నారు. దీంతో మా లో లుక‌లుక‌ల‌న్నీ బ‌య‌ట‌ప‌డిపోతున్నాయి.




Tags:    

Similar News