వామ్మో.. హీరో నిఖిల్ రాజకీయం మామూలుగా లేదే!

Update: 2019-04-10 06:16 GMT
ముందుగా అతడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశాడు. కర్నూలు జిల్లా కు వెళ్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ ప్రతాప్ తరఫున ఇతడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. దీంతో అతడి మీద తెలుగుదేశం ముద్ర పడింది. ఆ వెంటనే అతడు అలర్ట్ అయ్యాడు.

తను తెలుగుదేశం కాదు అని, కేఈ ప్రతాప్ తనకు అంకుల్ అని అందుకే ఆయన తరఫున వెళ్లి ప్రచారం చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. తన సపోర్ట్ జనసేనకు ఉందన్నట్టుగా అంతకు ముందు కూడా ఇతడు కలరింగ్ ఇచ్చాడు.

ఇక తాజాగా నిఖిల్ రాజకీయం కొత్త పుంతలు తొక్కింది. తన ఇన్ స్టాగ్రమ్  అకౌంట్ ద్వారా ఇతడు 'రాజకీయం'  చేస్తూ ఉన్నాడు. జనసేన తరఫున విశాఖ నుంచి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణను కలిసి ఈయన మద్దతు ప్రకటించాడు. ఎన్నడూ లేని రీతిలో లక్ష్మినారాయణ కొత్త రాజకీయం చేస్తున్నారని, బాండ్ పేపర్ల మీద హామీలను రాసిస్తూ ఉన్నాడని, జనసేన తరఫున చాలా సాధారణ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారు కూడా పోటీలో ఉన్నారని.. అది చాలా గొప్ప విషయం అని నిఖిల్ పేర్కొన్నాడు.

ఈ హీరో రాజకీయం అంతటితో కూడా ఆగలేదు. మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి కూడా ఈయన విషెస్ చెప్పాడు. సికింద్రాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీలో ఉన్న తలసాని సాయి యాదవ్ కు ఈయన మద్దతు ప్రకటించాడు. తలసాని సాయి యాదవ్ తనకు స్నేహితుడు అని ఫ్యామిలీ ఫ్రెండ్ అని .. ఆయన రాజకీయ ప్రయాణానికి శుభాకాంక్షలు అని నిఖిల్ మరో పోస్టు పెట్టాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఆ ఫొటోలో ఉన్నాడు.

ఇలా తెలుగుదేశం పార్టీ, జనసేన, తెలంగాణ రాష్ట్ర సమితి.. మూడు పార్టీల అభ్యర్థులను ఈయన కలిశాడు. తను కలిసి వాళ్లందరితోనూ తనకు ఏదో ఒక బాంధవ్యం ఉందని చెప్పుకొచ్చాడు. మొత్తానికి రాజకీయాల జోలికి వెళ్లకుండా ఇండస్ట్రీలోని చాలా మంది కామ్ గా ఉండిపోతే.. నిఖిల్ అన్ని పార్టీలనూ చుట్టేసి.. చాలా 'రాజకీయమే' చేస్తున్నట్టుగా ఉన్నాడు!
Tags:    

Similar News