టాప్ స్టోరి: బ‌హు భాషా ప్ర‌వీణ‌లు

Update: 2019-03-02 06:36 GMT
రాజ‌కీయాల్లో ఎదిగే వాళ్లు బ‌హుభాషా కోవిదులుగా క‌నిపిస్తారు. దివంగ‌త ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు - య‌శ్వంత్ సిన్హా వంటి నాయ‌కుల పేర్లు ప్ర‌ధ‌మ వ‌రుస‌లో ప్ర‌ముఖంగా వినిపిస్తాయి. భాజ‌పా నాయ‌కుడు.. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు బ‌హుభాషా కోవిదుడు. ఆయ‌న 10 భాష‌ల్లో అన‌ర్గ‌లంగా మాట్లాడ‌గ‌ల‌రు. వీరి స్ఫూర్తితో ఎంద‌రో బ‌హుభాషా కోవిదులు రాజ‌కీయాల్ని ఏల్తున్నారు. అయితే నాయ‌కుల‌కు ధీటుగా బ‌హుభాషా ప్ర‌వీణ‌లుగా నిరూపించుకుంటున్నారు మ‌న క‌థానాయిక‌లు. రాజ‌కీయాల్లోకి వ‌స్తారా రారా? అన్న‌ది అటుంచితే సౌత్ సినీప‌రిశ్ర‌మ‌ల్ని ఏల్తున్న డ‌జ‌ను క‌థానాయిక‌ల భాషా ప్రావీణ్యం గురించి తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే. వాక్కుతోనే కాసుల వ‌ర్షం కురిపించే స‌త్తా ఈ అమ్మ‌ణ్ణుల‌కు ఉంది. ఇది అరుదైన స్కిల్ అనే చెప్పాలి. నేర్చుకునే మ‌న‌సుండాలే కానీ.. సాధ్యం కానిది ఉంటుందా?  నాలుగు రాష్ట్రాల బార్డ‌ర్ లో నివ‌సిస్తేనే నాలుగు భాష‌లు మాట్లాడ‌తాం అంటే కుదర‌దు. నేటి ప్ర‌పంచంలో ఎద‌గాలి అంటే భాషలు ముఖ్యం. ఈ విష‌యంలో మ‌న భామ‌లు చాలా అడ్వాన్స్ డ్‌.

సౌత్ నాలుగు ప‌రిశ్ర‌మ‌లు స‌హా బాలీవుడ్ ని ఏలాలంటే క‌చ్ఛితంగా భాష ఒక్క‌టే ఆయుధం. క‌మ్యూనికేష‌న్ మేక్స్ పెర్ఫెక్ష‌న్.. బెట‌ర్ క‌మ్యూనికేష‌న్ గివ్స్ గ్రేట్ ఛాన్సెస్..! అన్న చందంగా.. ఈ భామ‌లు భాష‌ల్లో ఆరితేరిపోయి అన్ని ప‌రిశ్ర‌మ‌ల్ని ఏలేస్తున్నారు. సీనియ‌ర్ భామ‌ల్లో కాజ‌ల్ - అనుష్క‌ - త‌మ‌న్నా - స‌మంత ఇప్ప‌టికే బ‌హు భాషా కోవిదులుగా వెలిగిపోతున్నారు. మినిమంగా మూడు నాలుగు భాష‌లు అన‌ర్గ‌ళంగా మాట్లాడేస్తూ  అన్ని ప‌రిశ్ర‌మ‌ల్ని పేకాడేస్తున్నారు. ఓచోట కెరీర్ ప‌రంగా డ‌ల్ అయ్యాం అనుకోగానే, ఇరుగు పొరుగు భాష‌ల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నారు. నేర్చుకున్న భాష అందుకు చాలా పెద్ద సాయం అవుతోంది. కొంద‌రు పూర్తి స్థాయిలో అన‌ర్గ‌ళంగా మాట్లాడేయ‌క‌పోయినా మ్యానేజ‌బుల్ అనిపిస్తూ అవ‌కాశాలు కొట్టేస్తున్నారు. ముఖ్యంగా ఆంగ్ల భాష‌లో వెన‌క‌బ‌డిన తంబీల్ని త‌మిళంలో మాట్లాడి బుట్ట‌లో వేసేయ‌డంలో మ‌న క‌థానాయిక‌ల నైపుణ్యాన్ని ప్ర‌శంసించి తీరాలి. అస‌లు మ‌న క‌థానాయిక‌ల్లో ఏ భామ ఏ భాష‌ను మాట్లాడ‌గ‌ల‌రు? అన్న‌ది తెలుసుకోవాలంటే ఇది చ‌ద‌వాల్సిందే.

న‌వ‌త‌రం భామ‌ల్లో రాశీ ఖ‌న్నా .. తెలుగు - త‌మిళం - హిందీ - ఇంగ్లీష్ భాష‌ల్లో నేర్ప‌రి. నివేద థామ‌స్ .. తెలుగు - మ‌ల‌యాళం - ఇంగ్లీష్ - త‌మిళ భాష‌ల్లో అన‌ర్గ‌ళంగా మాట్లాడేస్తోంది. కీర్తి సురేష్.. త‌మిళం - మ‌ల‌యాళం - ఇంగ్లీష్ భాష‌ల్లో బ‌హు నేర్ప‌రి. తెలుగు లైట్ గా మాట్లాడుతుంది. రౌడీ పిల్ల సాయిప‌ల్ల‌వి.. మ‌ల‌యాళం - త‌మిళం - తెలుగు - ఇంగ్లీష్ చ‌క్క‌గా మాట్లాడుతుంది. మెహ్రీన్ .. ఇంగ్లీష్‌ - హిందీ.. అన‌ర్గ‌ళం. తెలుగు - త‌మిళం నేర్చుకుంటోందిట‌. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ .. మ‌ల‌యాళం - ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. తెలుగు - త‌మిళం నేర్చుకుంటోంది. సీనియ‌ర్ భామ‌ల్ని ప‌రిశీలిస్తే.. కాజ‌ల్ ..  హిందీ - ఇంగ్లీష్ లో ప్రావీణ్యం ఉంది. తెలుగు - త‌మిళం మేనేజ‌బుల్.  మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా ముంబై భామ అయినా తెలుగ‌మ్మాయిలా క‌లిసిపోయింది. తెలుగు భాష‌ను అన‌ర్గ‌ళంగా మాట్లాడుతోంది. త‌మిళం - హిందీ - ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడేస్తుంది. స్వీటీ శెట్టి మంగుళూరు బాలిక అనుష్క అంటే తెలుగ‌మ్మాయే. తెలుగు - క‌న్న‌డం - హిందీ - త‌మిళం - ఇంగ్లీష్ ఇన్ని భాష‌ల్లో అద్భుతంగా మాట్లాడుతుంది. అక్కినేని కోడ‌లు స‌మంత‌.. తెలుగు - త‌మిళం - - ఇంగ్లీష్ తిరిగి చూసుకునే ప‌నే లేదు. మొత్తానికి ఇప్పుడు వ‌స్తున్న క‌థానాయిక‌లు భాష నేర్చుకుని బ‌రిలో దిగుతున్నారు. బంతాడేసేందుకు ప‌క్కా ప్లాన్ తో దూసుకొస్తున్నారు. ఇక త్రిష లాంటి అగ్ర క‌థానాయిక ద‌శాబ్ధం పైగా టాలీవుడ్ ని ఏలినా ఇప్ప‌టికీ తెలుగు ముక్క రాదు ఎందుకో!!
   

Tags:    

Similar News