ధనుష్-ఐశ్వర్య డివోర్స్.. ఇది ఫైనల్!

ధనుష్ ఐశ్వర్య మళ్ళీ కలిసి అవకాశాలు ఉన్నాయని గత కొన్నిరోజులుగా వార్తలు వచ్చినప్పటికీ అందులో నిజం లేదని నేటితో క్లారిటీ వచ్చేసింది.

Update: 2024-11-27 16:19 GMT

తమిళ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య మధ్య 20 ఏళ్ల వివాహ బంధం ఇప్పుడు అధికారికంగా ముగిసింది. చెన్నై ఫ్యామిలీ కోర్టు బుధవారం (నవంబర్ 27) వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. 2004లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు కొడుకులు లింగా, యాత్ర ఉన్నారు. వారి విడిపోవడం చాలా మందికి షాకింగ్ న్యూసే. 2019లో వీరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక 2022 జనవరిలో ధనుష్ సోషల్ మీడియాలో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే, కోర్టు ద్వారా విడాకుల ప్రక్రియ ఇప్పటివరకు కొనసాగింది. గతంలో విడాకుల కేసుకు ఇద్దరూ కొన్నిసార్లు హాజరు కాలేదు. అయితే, ఐశ్వర్య గత వారం కోర్టుకు హాజరవడంతో చివరికి విడాకులు మంజూరు అయ్యాయి. విడాకుల ప్రక్రియ సాగుతున్న సమయంలో ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ తమ పిల్లలపై పూర్తి శ్రద్ధ పెట్టడం గమనార్హం.

తల్లిదండ్రులుగా పిల్లలకు సమయాన్ని కేటాయించడం వారిద్దరి ప్రాధాన్యతగా మారింది. ఈ విభేదాలు పిల్లలపై ప్రభావం చూపకుండా చూసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరు ఎందుకు విడిపోతున్నారు అనే విషయంలో అధికారికంగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక రజినీకాంత్, అలాగే ధనుష్ కుటుంబ సభ్యుల మధ్య చర్చలు కూడా జరిగాయి.

కానీ ధనుష్ - ఐశ్వర్య కలిసి జీవించేందుకు అసలు సిద్ధంగా లేరని అందుకే వారి మధ్యలో ఎన్ని చర్చలు జరిగిన సక్సెస్ కాలేదని సమాచారం. విడాకుల అనంతరం పిల్లల భవిష్యత్తు విషయంలో ఇద్దరు సమాన బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య పిల్లల కోసం.ప్రత్యేకంగా స్కూల్ కు సంబంధించిన వేడుకల్లో కూడా పాల్గొనడం జరిగింది. ధనుష్ ఐశ్వర్య మళ్ళీ కలిసి అవకాశాలు ఉన్నాయని గత కొన్నిరోజులుగా వార్తలు వచ్చినప్పటికీ అందులో నిజం లేదని నేటితో క్లారిటీ వచ్చేసింది.

ఇక ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమా చేస్తున్నాడు. అలాగే తమిళంలో కూడా రెండు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. ఇక, ధనుష్ మరో వివాదంలో కూడా ఇరుక్కున్నారు. నయనతార, విఘ్నేష్ శివన్ కలసి రూపొందించిన డాక్యుమెంటరీ "బియాండ్ ది ఫెయిరీటేల్" విషయంలో 'నానుమ్ రౌడీ దా' చిత్రానికి సంబంధించిన విజువల్స్ వాడారంటూ ధనుష్ కంపెనీ వుండర్‌బర్ ఫిల్మ్స్ మద్రాస్ హైకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేసింది. కోర్టు ఆ సూట్‌ను విచారణకు స్వీకరించింది.

ధనుష్ వాదనల ఆధారంగా మద్రాస్ హైకోర్టు నయనతార, విఘ్నేష్ శివన్, మరియు నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణకు ముందు నయనతార తన వాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News