థియేట్రికల్ రిలీజ్ కాబోతున్న తెలుగు బ్లాక్ బస్టర్ చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్స్..!

Update: 2022-01-19 08:54 GMT
'బాహుబలి' తో తెలుగు సినిమా సత్తా ఏంటో దేశవ్యాప్తంగా చాటిచెప్పబడింది. అప్పటి వరకు మన సినిమాలను కేవలం ప్రాంతీయ సినిమాలుగా భావించే బాలీవుడ్ జనాలు.. తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా మూవీ అని గుర్తించడం మొదలుపెట్టారు. 'బాహుబలి 2' 'సాహో' వంటి మన చిత్రాలు ఇచ్చిన ధైర్యంతో తమిళ కన్నడ సినిమాలు కూడా నేషనల్ వైడ్ మార్కెట్ మీద దృష్టి పెడుతున్నాయి.

కరోనా పరిస్థితుల్లో అందరూ సినిమాలు రిలీజ్ చేయడానికే భయపడుతుంటే.. 'పుష్ప: ది రైజ్' వంటి కమర్షియల్ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ విడుదల చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం మన ఫిలిం మేకర్స్ కే చెల్లింది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కంటే హిందీ మార్కెట్ లో ఎక్కువ వసూళ్ళు రాబట్టింది. ఈ నేపథ్యంలో మరికొన్ని సౌత్ సినిమాలను హిందీలోకి డబ్ చేసి థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

హిందీలో ఇప్పుడు థియేట్రికల్ రిలీజుల ఏమీ లేకపోవడం.. వచ్చిన సినిమాలకు ఆదరణ దక్కకపోవడంతో ఇప్పుడు అందరూ దక్షిణాది కంటెంట్ చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. 'పుష్ప' సక్సెస్ తో అల్లు అర్జున్ క్రేజ్ ని క్యాష్ చేసుకోడానికి 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని గోల్డ్ మైన్స్ వారు జనవరి 26న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

అలానే రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో రూపొందిన 'రంగస్థలం' సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయాలు అందుకున్న చిత్రాలను ఆయా చిత్ర నిర్మాతలు హిందీలో రిలీజ్ చెయ్యడానికి సిద్ధం చేస్తున్నారని టాక్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'అల వైకుంఠపురములో' సినిమా హిందీలో విడుదలైన తర్వాత 'రంగస్థలం' సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ తో పాటుగా కొన్ని తెలుగు తమిళ చిత్రాలను డబ్ చేయబోతున్నారని కొన్ని మీడియా వర్గాలు హైలైట్ చేస్తున్నాయి అని విశ్లేషకుడు ట్వీట్ లో పేర్కొన్నారు.

''సుకుమార్ దర్శకత్వంలో రామ్‌ చరణ్ - సమంత నటించిన 'రంగస్థలం' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని హిందీలో 2022 ఫిబ్రవరిలో విడుదల చేస్తారని మీడియా చెబుతోంది. అయితే 'అల వైకుంఠపురములో' రిలీజ్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద #AVPL పని చేస్తేనే 'రంగస్థలం' హిందీ సినిమా హాళ్లల్లోకి వస్తుంది. ఇది మాత్రమే కాదు.. అనేక తెలుగు తమిళ చిత్రాలను హిందీలోకి డబ్ చేసి థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్రెండ్ ని 'అల వైకుంఠపురములో' డిసైడ్ చేస్తుంది'' అని తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.
Tags:    

Similar News