సోనూ సూద్ కి ఆ డ్ర‌గ్ ఎలా వ‌చ్చింది.. 25న విచార‌ణ‌!

Update: 2021-06-17 09:34 GMT
ఏదైనా అప‌రాధం చేస్తే వెంట‌నే పోలీసులు కోర్టులు క‌నిపెట్ట‌లేక‌పోవ‌చ్చు కానీ మంచి ప‌నులు చేస్తే వెంట‌నే స్పందించే ఈ వ్య‌వ‌స్థ స్వ‌భావాన్ని సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు. గ‌త కొంత‌కాలంగా న‌టుడు సోనూసూద్ చేస్తున్న సేవ‌ల‌కు డ‌బ్బు ఎలా వ‌స్తోంది? అత‌డికి కోవిడ్ మెడిసిన్ ని అందించిన‌ది ఎవ‌రు? అంటూ ఆరాలు ఎక్కువ‌య్యాయి. దీనిలో రాజ‌కీయ కుయుక్తులు ప్ర‌వేశించ‌డంతో ర‌చ్చ‌ర‌చ్చ‌వుతోంది. అయితే ఇది కోర్టుల ప‌రిధిలోకి వెళ్ల‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెలకొంది.

గత సంవత్సరం కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి తనవైన‌ మానవతా సేవ‌ల‌తో  దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ పెంచుకున్న సోను సూద్ చట్టపరమైన ఇబ్బందుల్లో పడ్డాడు. సోషల్ మీడియాలో అవ‌స‌రార్థుల‌ SOS కాల్స్ .. విజ్ఞప్తులను అనుసరించి పౌరులకు కోవిడ్ నిరోధ‌క ఔషధాల సేకరణ సరఫరాలో సోనూ ఎవ‌రి సాయం తీసుకున్నారు? అన్న‌ది విచార‌ణ సాగుతోంది. అత‌డి వెన‌క‌ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషాన్ సిద్దిక్ పోషించిన పాత్రను పరిశీలించాలని బొంబాయి హైకోర్టు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సెలబ్రిటీలు మందులు నకిలీవా లేదా సరఫరా చట్టబద్ధమైనదా అనేది చూడ‌కుండా తమను తాము ఒకరకమైన ప్ర‌జా సేవికులుగా ఆవిష్క‌రించుకుంటున్నార‌ని హైకోర్టు అభిప్రాయపడింది. ఛారిటబుల్ ట్రస్ట్- బిడిఆర్ ఫౌండేషన్ .. సరఫరా చేసిన దాని ధర్మకర్తలకు వ్యతిరేకంగా మజ్గావ్ మెట్రోపాలిటన్ కోర్టులో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోని హైకోర్టుకు చెప్పడంతో జస్టిస్ ఎస్పీ దేశ్ ముఖ్... జిఎస్ కులకర్ణి ధర్మాసనం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ట్రస్ట్ కు అవసరమైన లైసెన్స్ లేనప్పటికీ కాంగ్రెస్ నేత‌ సిద్దిక్ కు యాంటీ కోవిడ్ డ్రగ్ రెమ్ డెసివిర్ ఎలా స‌ర‌ఫ‌రా చేశారు? అన్న‌ది కోర్టు ఆరా తీసింది.

గోరేగావ్ లోని ప్రైవేట్ లైఫ్ లైన్ కేర్ హాస్పిటల్ లోపల ఉన్న పలు ఫార్మసీల నుంచి సోను సూద్ మందులు తీసుకున్నారని ఆయన చెప్పారు. ఫార్మా కంపెనీ సిప్లా ఆయా ఫార్మసీలకు రెమ్ డెసివిర్ ను సరఫరా చేసిందని దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోంద‌ని కుంభ‌కోని తెలిపారు.

క‌రోనా మహమ్మారిని పరిష్కరించడానికి అవసరమైన మందులు వనరుల నిర్వహణకు సంబంధించిన అనేక అంశాలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిఐఎల్) విన్నప్పుడు హైకోర్టు ఇచ్చిన మునుపటి ఉత్తర్వులపై ఆయన స్పందించారు.

కొరోనావైరస్ నిరోధక మందులు సరఫరా కొరత ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉండగా.. ప్రముఖులు రాజకీయ నాయకులు ప్రజలకు ఎలా కొరోనావైరస్ ఔషధాలను సేకరించి పంపిణీ చేయగలిగారు? అనే దానిపై దర్యాప్తు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్రాన్ని ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం వారి చర్యలను పరిశీలిస్తుందని ఆశిస్తున్నాము. వారి పాత్రలను చాలా తీవ్రంగా పరిశీలించాలని కోరుకుంటున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ ఇద్దరూ ప్రజలతో నేరుగా ఇంట‌రాక్ట్ అయినందున ఈ మందుల‌ నాణ్యత లేదా మూలాన్ని ప్రజలకు తెలుసుకోవడం సాధ్యమేనా? అని ప్ర‌శ్నించింది.

బుధవారం ప్రచురించిన ఒక వార్తాకథనాన్ని హైకోర్టు ఈ విచార‌ణ సంద‌ర్భంగా ప్రస్తావించింది. నగరంలోని ఒక ప్రైవేట్ హౌసింగ్ సొసైటీ మోసం చేసింద‌ని ఆ భ‌వంతిలో నివాసితులకు టీకా డ్రైవ్ చేసిన వాళ్లు నకిలీ యాంటీ-కోవిడ్ -19 వ్యాక్సిన్లను ఇచ్చార‌ని పేర్కొంది. వ్యవస్థ లో ఇలాంటివి జరగకూడదు. ఇవి మనం సంతోషంగా లేని పరిస్థితులు అని హైకోర్టు జ‌డ్జీలు వ్యాఖ్యానించారు. ఆ ఇద్ద‌రిపైనా పిటిషన్ ను జూన్ 25 న హైకోర్టు విచారించనుంది.
Tags:    

Similar News