'RRR' లో భీమ్ బైక్ వెనుక ఇంత చ‌రిత్ర ఉందా?

Update: 2022-03-23 08:35 GMT
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా రిలీజ్ అవుతోన్న 'ఆర్ ఆర్ ఆర్' ఇద్ద‌రి విప్ల‌వ యోధుల క‌థ ఆధారంగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు అల్లూరి సీతారామ‌రాజు - గోండు వీరుడు కొమ‌రం భీమ్ పాత్ర‌ల  ఆధారంగా చిత్రాన్ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించారు. ఇలా సినిమాలో ఇద్ద‌రు స‌మ‌ర‌యోధులున్న క‌థ అయినా పూర్తిగా ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ డ్రామా గానే  ప్రేక్ష‌కుల ముదుకు రానుంది.

పూర్తిగా క‌మ‌ర్శియ‌ల్ జోన్ లోనే సినిమాని తెర‌కెక్కించారు. ఒక్కో యాక్ష‌న్ ఎపిసోడ కోస‌మే జ‌క్క‌న్న నెల‌ల స‌మ‌యం తీసుకున్నారు. సినిమాని ఓవైపు విజువ‌ల్ వండ‌ర్ గా చూపిస్తునే మ‌రోవైపు యాక్ష‌న్ స‌న్నివేశాల్ని ప‌తాక స్థాయిలో ఆవిష్క‌రించ‌నున్నారు. రామ్ చ‌ర‌ణ్‌-తార‌క్ మేకోవ‌ర్  కోసం ఎంతో శ్ర‌మించారు. విదేశీ టెక్నీషియ‌న్లు సైతం సినిమా కోసం ప‌నిచేసారు.

ఇంకా  సినిమాలో ఇలాంటి ప్ర‌త్యేక‌త‌లెన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు తార‌క్ అభిమానుల్లో సినిమాలో తార‌క్ వినియోగించిన ఓల్డ్  బైక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  బైక్ వెరైటీగా ఉంది? ఇది ఎప్పుడు మోడ‌ల్ బైక్? అంటూ అభిమానున‌ల్లో చ‌ర్చ‌కు దారి తీసింది.  అయితే ఈ బైక్ కి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. ఇలాంటి బైక్ కోసం రాజ‌మౌళి చాలా అన్వేషించారుట‌.

1920 కాలానికి చెందిన బైక్ ఇది. అప్ప‌ట్లో ఇలాంటి బైక్ లు ఉన్నాయా? అని ర‌క‌ర‌కాల రీసెర్చ్ త‌ర్వాత ఖ‌రారు చేసుకుని ఈ మోడ‌ల్ బైక్ ని తార‌క్  పాత్ర‌కి సెట్ చేసారుట‌.  బ్రిట‌న్ కంపెనీ అయిన దీని హెడ్ ఆఫీస్ బ‌ర్మింగ్ హామ్ లో  ఉంది. 1920 నుంచి 1950 వ‌ర‌కూ అంత‌ర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో అగ్ర స్థానంలో ఈ మోడ‌ల్ బైక్ కొన‌సాగిందిట‌.

అప్ప‌ట్లో 350 సీసీ..500సీసీ  బైక్ ల‌ను  ఈకంపెనీ లాంచ్ చేసింది. అయితే 1971లో కంపెనీ ఉత్ప‌త్తిని ఆపేసింది. అప్ప‌టి నుంచి బైక్ అందుబాటులో లేదు. కానీ సినిమాలో తార‌క్ పాత్ర కోసం అవ‌స‌ర‌మైంది. ఆ మోడ‌ల్ బైక్ ఇప్పుడు  దొర‌క‌దు కాబ‌ట్టి ఇప్ప‌టి మోడ‌ల్ కి  అదే డిజైన్ తో సిద్దం చేయించారుట‌.

 అందుకోసం  20 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసారుట‌. మ‌రి ఈ బైక్ ని 'ఆర్ ఆర్ ఆర్'  గుర్తుగా ఉంచుకుంటారా?  లేక అభిమానుల మ‌ధ్య ఏదైనా పోటీ నిర్వ‌హించి బ‌హుమ‌తిగా ఇస్తారా?  వేలం వేస్తారా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News