ఆ లోపం హృతిక్ ను ఆపలేకపోయింది!

Update: 2019-03-17 08:04 GMT
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు భారతదేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడ భారీ ఫాలోయింగ్ ఉంది.  సూపర్ ఫిట్నెస్ తో.. అసూయ పుట్టించే లుక్స్ తో బాలీవుడ్ గ్రీక్ గాడ్ గా పేరు తెచ్చుకున్న రోషన్ కు కూడా కష్టాలు ఉంటాయి అంటే ఎవరూ నమ్మరు.  ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో సినిమా ఎంట్రీ ఈజీగానే దక్కింది.  నాన్న ఫిలిం మేకర్.. బాబాయ్ మ్యూజిక్ డైరెక్టర్. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్. కెరీర్ స్లో అయిందన్నప్పుడు నాన్నగారు రాకేష్ రోషన్ ఒక సూపర్ హిట్ తో మళ్ళీ తన కెరీర్ ను గాడిన పడేలా చేస్తాడు.

ఇవన్నీ ఉన్న హృతిక్ కు ఒకటే లోపం.. నత్తి. అసలు ఆ లోపం ఉందని చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆ లోపాన్ని అధిగమించేందుకు ఎంతో కష్టపడుతుంటాడు.  నిజానికి హృతిక్ రోషన్ డైలాగ్ డెలివరీ కానీ.. డిక్షన్ కానీ అద్భుతంగా ఉంటాయి. మరి నత్తి లాంటి లోపాన్ని ఎలా అధిగమిస్తున్నాడు?  హృతిక్ ఇప్పటికీ రోజూ గంటసేపు స్పీచ్ థెరపీ ప్రాక్టిస్ చేస్తాడట.  చిన్నతనంలో నత్తికారణంగా ఫ్రెండ్స్ తో ఇబ్బందులు ఎదుర్కొన్నాడట హృతిక్.  కానీ స్పీచ్ థెరపీని రెగ్యులర్ గా ప్రాక్టిస్ చేస్తూ అధిగమిస్తున్నాడట.   ఇదిలా ఉంటే రీసెంట్ గా ది ఇండియన్ స్టామరింగ్ అసోసియేషన్(TISA) వారు హృతిక్ ను తన నివాసం లో కలిశారు.  త్వరలో ఈ అసోసియేషన్ కు హృతిక్ బ్రాండ్ అంబాజిడర్ గా వ్యవహరిస్తారని సమాచారం.  ఈ సభ్యులతో మాట్లాడే సమయంలో తనకు చిన్నప్పటి నుంచి దాదాపు 2012 వరకూ ఈ సమస్య ఉండేదని వెల్లడించాడు.. అంటే సూపర్ స్టార్ గా మారిన తర్వాత కూడా ఇబ్బంది ఎదుర్కొన్నట్టే.

ఈ సందర్భంగా దుబాయ్ లో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేస్తుకున్నాడు హృతిక్.  ఒక అవార్డును అందుకునేందుకు దుబాయ్ వెళ్ళడం జరిగిందట. తన స్పీచ్ లో దుబాయ్ అనే పదం పలకడంలో ఇబ్బంది ఎదురవుతుందని భావించి అవార్డు ఫంక్షన్ కు ముందు చాలా సమయం తన హోటల్ రూమ్ లో దుబాయ్ అనే పదాన్ని పలుకుతూ ప్రాక్టిస్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు.   ఎవరైనా స్టార్ కిడ్ విజయం సాధిస్తే వారికి సక్సెస్ ఊరికే వచ్చిందని కొందరు చులకనగా చూస్తుంటారు. కానీ ఎవరికైనా ఎంట్రీ ఈజీ అవుతుందేమో కానీ హృతిక్ లా ఒక మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడం మాత్రం కష్టమైన విషయమే. పైగా నత్తి లాంటి సమస్య ను అధిగమించి మరీ ఒక నార్మల్ వ్యక్తి లాగా డైలాగులు చెప్పడం అంటే నిజంగా హృతిక్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి.  ఊరికే నేపోటిజం అనే ఏడ్చే జనాలు.. ఇలాంటి విషయాలను ఎందుకు ప్రేరణగా తీసుకోరు?  ఏదేమైనా TISA కు హృతిక్ కంటే బెస్ట్ బ్రాండ్ అంబాజిడర్ మరొకరు దొరకరు.  నత్తితో బాధపడే వారు హృతిక్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని తమ సమస్యను అధిగమిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది?
    

Tags:    

Similar News