లాల్ పై ఎక్కువ నమ్మకం పెట్టారా

Update: 2018-12-14 11:16 GMT
తెలుగుస్టార్ హీరోల మార్కెట్ ఎంత ఉందో సరిగ్గా అంచనా వేయలేక చాలా సార్లు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు బోల్తా పడుతుంటారు. స్ట్రెయిట్ సినిమాల పరిస్థితే అలా ఉంటే ఇతర భాషల స్టార్ హీరోల డబ్బింగ్ సినిమాల విషయంలో ఈ కన్ఫ్యూషన్ ఎక్కువగానే ఉంటుంది.  ఈ రోజు మలయాళం సూపర్ స్టార్ మొహన్ లాల్ నటించిన 'ఒడియన్ రిలీజ్' అయింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను రూ. 5 కోట్లకు తీసుకున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' రిలీజ్ అయ్యేవరకూ తెలుగులో మోహన్ లాల్ కు అసలు మార్కెట్ లేదు.  'జనతా గ్యారేజ్' సూపర్ హిట్ కావడం పైగా ఎన్టీఆర్  పెదనాన్న పాత్రలో మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులను మెప్పించడంతో ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ పెరిగింది.  ఆతర్వాత రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమా 'మన్యం పులి' డబ్బింగ్ రైట్స్ రూ. 1.5 కోట్లకు కొంటే ఏకంగా రూ .6 కోట్లు కలెక్ట్ చేసింది.  కానీ మోహన్ లాల్ నెక్స్ట్ సినిమా.. స్ట్రెయిట్ ఫిలిం అయిన 'మనమంతా'కు మంచి రెస్పాన్స్ వచ్చినా ఫెయిల్యూర్ గా నిలిచింది. మరి మోహన్ లాల్ కు రూ. 5 కోట్లు కలెక్ట్ చేసే మార్కెట్ ఉందా అనేది అలోచించాల్సిన విషయం.

పైగా ఒక్కవారంలోనే ఈ కలెక్షన్స్ సాధించాలి. డిసెంబర్ 21 న నాలుగు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.   'అంతరిక్షం'.. 'పడి పడి లేచే మనసు' .. 'కె జీ ఎఫ్' లతో పాటు షారూఖ్ ఖాన్  'జీరో' కూడా అదేరోజు రిలీజ్ అవుతుంది.  మరి ఈ సినిమాల హంగామా మొదలయ్యే లోపు సూపర్ స్టార్ పెట్టుబడిని వెనక్కు తీసుకురాగలడా లేదా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News