ఆలస్యమైనా ఆధరిస్తున్నారు

Update: 2019-06-25 07:40 GMT
రామ్‌ చరణ్‌ హీరోగా సమంత హీరోయిన్‌ గా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ వారు నిర్మించిన చిత్రం 'రంగస్థలం'. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం చిత్రం నాన్‌ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిన విషయం తెల్సిందే. మాస్‌ క్లాస్‌ అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న రంగస్థలం చిత్రం 200 కోట్లకు పైగా గ్రాస్‌ ను దక్కించుకుంది. బాహుబలి తర్వాతి స్థానంలో రంగస్థలం నిలిచింది. తెలుగులో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న రంగస్థలంను సంవత్సరం దాటిన తర్వాత మలయాళంలో విడుదల చేయడం జరిగింది.

మలయాళంలో గతంలో చరణ్‌ నటించిన కొన్ని సినిమాలు విడుదల చేయడం జరిగింది. 'మగధీర' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో 'రంగస్థలం' చిత్రం కూడా మంచి వసూళ్లతో అక్కడ ప్రదర్శింపబడుతోంది. రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేస్తూ దూసుకు పోతుంది. మలయాళ ప్రేక్షకులు రామ్‌ చరణ్‌ సినిమాను మరోసారి ఆధరిస్తున్నారు. కాస్త ఆలస్యంగా విడుదలైనా కూడా అక్కడి ప్రేక్షకులు మాత్రం ఫ్రెష్‌ మూవీగా సినిమాను ఆధరిస్తున్నారు.

'రంగస్థలం' చిత్రం మలయాళంలో విడుదల అయిన సందర్బంగా రామ్‌ చరణ్‌ ఫేస్‌ బుక్‌ ద్వారా స్పందించాడు. హలో కేరళ.. మలయాళంలో రంగస్థలం చిత్రం విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. మీ సమీపంలో ఉన్న థియేటర్లలో రంగస్థలం చూడండి అంటూ పోస్ట్‌ చేశాడు. చరణ్‌ పోస్ట్‌ ను ఉపాసన ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసింది. కేరళలో ప్రస్తుతం పెద్ద సినిమాలు హిట్‌ సినిమాలు లేని సమయంలో రంగస్థలం విడుదలైన కారణంగా మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇక మరో వైపు రామ్‌ చరణ్‌ ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ తో కలిసి రామ్‌ చరణ్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాడు. అల్లూరి సీతారామ రాజు పాత్రలో చరణ్‌ కనిపించబోతున్నాడు. చరణ్‌ కు జోడీగా ఆలియా భట్‌ కనిపించబోతుంది. మరో వైపు తన తండ్రి చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని కూడా చరణ్‌ నిర్మిస్తున్నాడు.
Tags:    

Similar News