'హంట్' టీజర్: అర్జున్ A - అర్జున్ B గా సుధీర్ బాబు..!

Update: 2022-10-03 07:08 GMT
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''హంట్''. 'గన్స్ డోన్ట్ లై' (తుపాకులు అబద్ధాలు చెప్పవు) అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇందులో తమిళ హీరో 'ప్రేమిస్తే' భరత్ - సీనియర్ నటుడు శ్రీకాంత్ మేకా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ - ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు క్యారక్టర్ పోస్టర్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

అందరూ వెంబడించడానికి సిద్ధంగా ఉంటారు.. కానీ కొంతమంది మాత్రమే 'వేట' కొనసాగించగలరని పేర్కొన్నారు. 'హంట్' సినిమాలో టఫ్ అండ్ డైనమిక్ పోలీసాఫీసర్ అర్జున్ ప్రసాద్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నట్లు క్యారక్టర్ పోస్టర్ ద్వారా తెలియజేసారు. అయితే టీజర్ లో అతని పాత్రలో మరో కోణం ఉన్నట్లు చూపించారు.

అర్జున్-A మరియు అర్జున్-B అంటూ అతను రెండు రకాలుగా ప్రవర్తిస్తాడని చెప్పారు. అలానే అర్జున్-A కి తెలిసిన మనుషులు - సంఘటనలు - వ్యక్తిగత జీవితం గురించి అర్జున్-B కి తెలియదని.. ఒకే వ్యక్తి ఇద్దరు వ్యక్తుల్లా బిహేవ్ చేస్తారని టీజర్ లో పేర్కొన్నారు.

అయితే అర్జున్ A కి తెలిసిన భాషలు - స్కిల్స్ - పోలీస్ ట్రైనింగ్ వంటివి అర్జున్-B లో కూడా ఉన్నాయి. కానీ సుధీర్ బాబుకి మాత్రం అర్జున్-B గా ఉండటానికి ఇష్టపడటం లేదు. తిరిగి అర్జున్-A గా మారాలని కోరుకుంటున్నాడు.

'ఏ కేసునైతే అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో.. అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి' అని శ్రీకాంత్ చెప్పడం.. 'అతను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్ లో.. ఎవరు ఎఫెక్ట్ అయినా, ఎంత ఎఫెక్ట్ అయినా నన్ను ఎవరూ ఆపలేరు' అని సుధీర్ బాబు చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది.

పోలీసాఫీసర్ అర్జున్ టేకాఫ్ చేసిన కేస్ ఏమిటి? హంట్ ఎవరి కోసం సాగింది? ఎలా సాగింది? అర్జున్-A & అర్జున్-B వెనకున్న అసలు కథేంటి? అనేది ఈ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. స్టైలిష్ యాక్షన్ తో ఆధ్యంతం ఆసక్తిని రేకెత్తించేలా సాగిన 'హంట్' టీజర్ ఆకట్టుకుంటోంది. విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ దీనికి ప్లస్ అయ్యాయి.

సుధీర్ బాబు ఇంటెన్స్ రోల్ లో పర్ఫెక్ట్ ఫిజిక్ తో మెప్పించాడు. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో.. ఇప్పుడు మరోసారి సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడని టీజర్ ని బట్టి తెలుస్తుంది. యాక్షన్ సీన్స్ లో ఎప్పటిలాగే అదరగొట్టాడు.

ఇందులో శ్రీకాంత్ తో పాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల కూడా కనిపించారు. మైమ్ గోపి - కబీర్ దుహాన్ సింగ్ - మౌనిక రెడ్డి - గోపరాజు రమణ - చిత్రా శుక్ల - సంజయ్ స్వరూప్ - రవి వర్మ - సత్య కృష్ణన్ - అభిజీత్ పూండ్ల తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

''హంట్'' చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం సమకూర్చగా.. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వివేక్ అన్నామలై ఆర్ట్ డైరెక్టర్ గా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full View

Tags:    

Similar News