నా టాలెంట్ పై నాకు నమ్మకం ఎక్కువ: సత్యదేవ్

Update: 2021-07-26 03:35 GMT
మొదటి నుంచి కూడా 'సత్యదేవ్' విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. కెరియర్ ఆరంభంలో చాలా చిన్నచిన్న పాత్రలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.    'బ్లఫ్ మాస్టర్' .. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి సినిమాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఆయన తాజా చిత్రంగా 'తిమ్మరుసు' రూపొందింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెలా 30వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నాడు.

"నా కెరియర్ చాలా చిత్రంగా మొదలైంది .. చాలా చిన్న పాత్రలు చేశాను. ఎక్కడో వెనకాతల నిలబెట్టారు .. నన్ను ఎవరు చూస్తారు? నేను ఎవరికి కనిపిస్తాను? అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు చిన్న డైలాగ్ ఉన్నా బాగా ప్రాక్టీస్ చేసి నా స్టైల్లో చెప్పడానికే ప్రయత్నించేవాడిని. అలా నేనేంటో నిరూపించుకోవాలనే ఒక తపన మొదటి నుంచి ఉండేది. అలా నేను చేసిన ఒకపాత్రను చూసి మరో సినిమా ఇచ్చేవారు. ఆ సినిమాలో బెటర్ గా చేస్తే మరో అవకాశం వచ్చేది. ఇలా ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ ఇక్కడి వరకూ వచ్చాను.

నేను ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. కెరియర్ పరంగా మరింత ముందుకు వెళ్లడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను ఇంకా ముందుకు వెళ్లవలసి ఉంది .. నిలదొక్కుకోవలసి ఉంది. ఒక నటుడిగా నేను ఇంకా చాలా జర్నీ చేయవలసి ఉంది. ఇండస్ట్రీలో చాలా పోటీ ఉంటుంది. ఇక్కడికి ఎవరైనా రావొచ్చు .. తమ టాలెంట్ ను నిరూపించుకోవచ్చు. అందువలన ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు .. అవకాశాల కోసం పోటీ పడుతూనే ఉంటారు. అవకాశం మనవరకూ రావడానికే ఇక్కడ మనం కృషి చేయవలసి ఉంటుంది.

ఇప్పుడు నా చేతిలో ఒక అరడజను సినిమాలు ఉన్నాయి .. నేను ఒకదాని తరువాత ఒకటిగా అంగీకరించినవే. కరోనా కారణంగా షూటింగులు ఆగిపోవడంతో, వరుస సినిమాలను ఒప్పుకుంటున్నట్టుగా ఉంటుంది. కానీ ఆగిపోయిన సినిమాలను ఒకదాని తరువాత ఒకటిగా పూర్తిచేసుకుంటూ వస్తున్నాను. 'గుర్తుందా శీతాకాలం' .. 'గాడ్సే' .. 'స్కైలాబ్' సినిమాలు అలా పూర్తి చేసినవే. నేను ఇది చేస్తాను ... చేయగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు చాలా ఎక్కువ. ఇంతదూరం రావడానికి అదే కారణం.

'జ్యోతిలక్ష్మి' సినిమా చూసిన తరువాత .. ఆ సినిమాకి నేను మైనస్ అవుతానని వర్మగారు పూరితో అన్నారట. 'ఎవడు వీడు .. ఎందుకు తీసుకున్నావ్' అని అడిగారట. ఆ విషయం నాకు వర్మగారే చెప్పారు. ఆ తరువాత ఆయనే నన్ను పిలిచి ఆ పాత్రకు నేనే కరెక్ట్ అన్నారు. అప్పుడు నాపై నాకు మరింత నమ్మకం కలిగింది. 'తిమ్మరుసు' నా నమ్మకాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా నా కెరియర్ కి మరింత హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.    
Tags:    

Similar News