14 ఏళ్లుగా పవన్ సార్ ను కలవలేకపోయాను : నాని

Update: 2022-06-10 04:17 GMT
ఈ మధ్య కాలంలో నాని తన సినిమాల కథలపైనే కాదు .. ఆ పాత్రల లుక్స్ పై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాడు. 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో విభిన్నమైన లుక్ తో మెప్పించిన ఆయన, 'అంటే .. సుందరానికీ' సినిమాలో కూడా విభిన్నమైన లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో బ్రాహ్మణ యువకుడైన సుందర ప్రసాద్ గా ఆయన సందడి చేయనున్నాడు. పూర్తి వినోదభరితమైన చిత్రంగా నిలిచిన ఈ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడాడు.

" ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేదానికి ఇంతకంటే యాప్ట్ మీనింగ్ ఇంకొకటి ఉండదేమో. ఇక్కడికి వచ్చిన అతిథులకు .. అభిమానులకు ధన్యవాదాలు. సినిమా ఫీల్డ్ కి వచ్చిన తరువాత  దాదాపు అందరి హీరోలను నేను కలిశాను. కల్యాణ్ గారిని కలుసుకునే ఒక సందర్భం .. అవకాశం మాత్రం ఎప్పుడూ రాలేదు.

ఇండస్ట్రీలో 14 ఏళ్లుగా ఉంటున్నా ఆయనను  కలవకపోవడం నిజంగానే చాలా విచిత్రంగా ఉంది. మిగతా వాళ్లంతా కూడా నాకు ఈ మధ్యనే పరిచయం అనే ఫీలింగ్  కలుగుతుంది. ఎప్పుడూ కలవని కల్యాణ్ గారితో చిన్నప్పటి నుంచే పరిచయం అనే ఫీలింగ్ ఉంది.

అలాంటి పవన్ కల్యాణ్ గారు ఇక్కడికి రావడం మా టీమ్ కి ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. ఇందాక ఆయన చెప్పిన విషయంతో నా కడుపు నిండిపోయింది. మా సినిమా టీమ్ అంతా కూడా ఎంతో కష్టపడి పనిచేసింది . కల్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే  మా వాళ్లందరికీ కొంచెం తిక్క ఉంది .. దానికో లెక్కుంది .. ఆ లెక్క ఏమిటనేది రేపు మీకు అర్థమవుతుంది.

వివేక్ ఆత్రేయ ప్రతి ఆర్టిస్ట్ నుంచి హండ్రెడ్ పెర్సెంట్ అవుట్ పుట్ ను తీసుకున్నాడు. నాకు సంబంధించినంత వరకూ ఈ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమా చేస్తూ మేమెంత ఎంజాయ్ చేశామో .. మీరంతా చూస్తూ అంతే  ఎంజాయ్ చేస్తే అంతకు మించి కావలసినదేం లేదు.

పవన్ గారు రావడం  .. మీరంతా ఇంత ఎనర్జీ చూపుతుండటం చూస్తుంటే ఈ  సినిమా బ్లాక్ బస్టర్ అనే వైబ్స్ కనిపిస్తున్నాయి. చిన్నా  పెద్దా అనే తీడా లేకుండా ఒక కుటుంబంలా మేమంతా కలిసి పనిచేసిన సినిమా ఇది. ఇలాంటి  టీమ్ లు గెలవాలి .. అలాంటి  సినిమాలు గెలవాలి. రేపు డెఫినెట్ గా గెలుస్తాం అనే నమ్మకం నాకు ఉంది. 'అంటే .. సుందరానికీ' ఎంటర్టైన్మెంట్ కాదు .. ఎంజాయ్ మెంట్" అంటూ ముగించాడు.
Tags:    

Similar News