విశాల్‌ కు ఐటీ శాఖ స‌మ‌న్లు వ‌చ్చేశాయ్‌!

Update: 2017-10-25 12:36 GMT
చెంప‌కు చేయి ప‌ర‌మైన‌.. కంటికి నీరు ఆదేశ‌మ‌వున్ అంటూ చిన్న‌ప్పుడు ఎప్పుడో తెలుగు మాష్టారు చెప్పిన మాట విశాల్ కు స‌మ‌న్లు అన్న బ్రేకింగ్ చేసినంత‌నే అప్ర‌య‌త్నంలో మెదిలిన మాట ఇది. త‌మిళ‌న‌టుడు విశాల్ గురించి చెప్పాల్సి వ‌స్తే.. సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా.. త‌న తోటి త‌మిళులు క‌ష్టంలో ఉన్నారంటే చాలు క‌దిలిపోతాడు. తానో పేరున్న న‌టుడ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోతాడు. వ్య‌క్తిగా తానేం చేయ‌గ‌ల‌నో అదంతా చేస్తాడు.

త‌న స్టార్ డ‌మ్‌ను ప‌క్క‌న పడేసి నిజాయితీగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న పేరుంది. ఆ మ‌ధ్య చెన్నై మ‌హాన‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేసిన భారీ వ‌ర‌ద‌ల వేళ‌.. త‌న ఇమేజ్ ను మ‌డిచి లోప‌ల పెట్టేసి.. సాదాసీదా మ‌నిషిగా బ‌య‌ట‌కు రావ‌టం.. క‌ష్టంలో ఉన్న వారిని ఆదుకోవ‌టం లాంటివెన్నో క‌నిపిస్తాయి. అలాంటి విశాల్‌.. జ‌ల్లిక‌ట్టు ఇష్యూలో కావొచ్చు.. తాజాగా విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ చిత్రంలో జీఎస్టీ వ్య‌తిరేక వ్యాఖ్య‌లు ఉండ‌టాన్ని ఆహ్వానించ‌ట‌మే కాదు.. మ‌ద్ద‌తు ఇవ్వ‌టం క‌నిపిస్తుంది.

అధికార‌ప‌క్షానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌ముఖుల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌లు తీర్చుకోవ‌టం ఇప్పటి వ్యూహం కాదు. అమ్మ‌మ్మ‌ల నాటిది. కానీ.. ఇలాంటివి ప్ర‌జ‌ల్లో లేని కోపాన్ని పెంచ‌ట‌మే కాదు.. ప్ర‌భుత్వాల‌కు చెరిగిపోని మ‌చ్చ‌లుగా మార‌తాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మోడీ స‌ర్కారు అమ‌ల్లోకి తెచ్చిన జీఎస్టీ ప‌న్ను విధానం మీద తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన మెర్స‌ల్ చిత్రానికి మ‌ద్ద‌తు ఇచ్చిన విశాల్ మీద‌.. అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించ‌టం హాట్ టాపిక్ అయ్యింది. మెర్స‌ల్‌కు మ‌ద్ద‌తు ఇచ్చినందుకు అంత‌కంత‌కూ మూల్యం చెల్లించాల్సి వ‌చ్చింద‌న్న మాట వినిపించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆదాయ‌ప‌న్ను శాఖాధికారులు విశాల్‌కు నోటీసులు జారీ చేశారు. త‌మ త‌నిఖీల్లో రూ.51ల‌క్ష‌ల ప‌న్ను చెల్లించ‌లేదంటూపేర్కొన్న‌ట్లుగా చెబుతున్నారు. త‌మ త‌నిఖీల్లో భాగంగా కొన్ని కీల‌క ఆధారాల్నిఐటీ శాఖ తీసుకెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. మెర్స‌ల్ చిత్రానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌టం వ‌ల్లే క‌ష్టాలు కొని తెచ్చుకున్న‌ట్లుగా కొంద‌రు వ్యాఖ్య‌లు చేస్తున్నా.. విశాల్ మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు.

త‌న ఆదాయానికి మించిన లెక్క‌ల‌న్నీ ప‌క్కాగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఒక‌వేళ త‌న‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే మాత్రం త‌గిన రీతిలో స‌మాధానం చెబుతాన‌ని ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో అభిమానుల్ని సైతం తొంద‌ర‌ప‌డొద్దంటూ సూచ‌న చేసిన ఆయ‌న‌..రాష్ట్రంలో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని వాటి మీద దృష్టిపెట్టాల‌ని.. త‌న విష‌యాన్ని వ‌దిలేయాల‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం. ఏమైనా.. మోడీ స‌ర్కారుకు న‌ష్టం వాటిల్లేలా వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ముఖులకు త‌నిఖీల క‌ష్టాలు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌న్న మాట నిజ‌మ‌నిపించేలా ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం కేంద్రానికి అంత మంచిది కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News