మీ అభిమాన థియేటర్లలో.. సాధారణ టికెట్ రేట్లతో..!

Update: 2022-05-20 11:30 GMT
కరోనా పాండమిక్ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయిందని.. సినిమాపై ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసి టికెట్ రేట్ల పెంపు జీవో తీసుకొచ్చారు టాలీవుడ్ పెద్దలు. అంతేకాదు భారీ బడ్జెట్ చిత్రాలను ప్రత్యేకంగా పరిగణించాలంటూ అదనంగా రేట్లు పెంచుకోడానికి అనుమతి తెచ్చుకుంటున్నారు.

అయితే ఈ రేట్లు కొన్ని పెద్ద సినిమాలకు భారీ ఒపెనింగ్స్ రాబట్టడానికి ఉపయోగపడితే.. మరికొన్ని చిత్రాలకు ప్రతికూలంగా మారుతోంది. అధిక టికెట్ ధరల కారణంగా సామాన్య ప్రజలు థియేటర్లకు రావడం లేదు. అడ్డగోలుగా రేట్లు పెంచుకుంటూ పోవడంతో చిరంజీవి - మ‌హేష్ బాబు లాంటి స్టార్ సినిమాల‌కు కూడా థియేట‌ర్లు నిండ‌ని ప‌రిస్థితి వచ్చింది.

ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడిన ఆడియన్స్.. అంత రేటు పెట్టి సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్ళడానికి ఆసక్తి కనబరచడం లేదు. దీంతో టికెట్ రేట్ల వల్లే ఇప్పుడు థియేటర్లు వెల‌వెల‌బోతున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా అంగీకరించారు.

అధిక టికెట్ ధరల వల్ల చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదని.. రిపీట్ ఆడియన్స్ తగ్గిపోయారని పేర్కొన్నారు. అప్పర్ క్లాస్ ఓకే కానీ.. మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ మాత్రం థియేటర్ కి రావడం తగ్గిపోవడం గమనించామని.. టికెట్ రేట్లు అందుబాటులో లేకపోవడం దీనికి కారణమని నిర్మాత అభిప్రాయ పడ్డారు.

ఈ నేపథ్యంలోనే దిల్ రాజు నిర్మించిన ''ఎఫ్ 3'' చిత్రాన్ని సాధారణ టికెట్ రేట్లతో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. మేకర్స్ అడిగితే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఓ వారం పాటు అదనంగా టికెట్ ధరలు పెంచుకోడానికి పర్మిషన్ ఇచ్చేవారు. కానీ పరిస్థితిని అర్థం చేసుకొని దిల్ రాజు మామూలు రేట్లే పెడుతున్నారు.

ఈ మేరకు ''మీ అభిమాన థియేటర్లలో.. సాధారణ టికెట్ రేట్లతో'' అంటూ 'ఎఫ్ 3' పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. మల్టీప్లెక్స్ లలో 250 + జీఎస్టీ.. మిగతా థియేటర్లలో జీఎస్టీ కలుపుకొని 250 గా టికెట్ ధరలు ఉండనున్నాయి. హైదరాబాద్ లో సింగల్ స్క్రీన్స్ అన్నీ 150 + జీఎస్టీ మరియ రూరల్ ఏరియాల్లో జీఎస్టీతో కలిపి 150 రూపాయలుగా ఉంటుంది.

ఇటీవల కాలంలో విడుదలైన సినిమాలతో పోల్చుకుంటే 'ఎఫ్ 3' రేట్లు చాలా తక్కువనే చెప్పాలి. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన సినిమా కావడంతో.. ధరలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత జీవో ప్రకారం పాత ధరలకే టికెట్లు రేట్లని తగ్గించామని మేకర్స్ చెబుతున్నారు.

ఏదేమైనా పోస్టర్స్ మీద సినిమా టికెట్ రేట్ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చాయనే దానిపై సినీ ప్రముఖులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి కదా అని ఇష్టానుసారంగా రేట్లు పెంచితే.. సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు.

డిజిటల్ వేదికలకు అలవాటు పడిన జనాలు.. ఎలాగూ మూడు నాలుగు వారాల్లో ఓటీటీలోకి వస్తుందిలే అనే ధోరణిలో ఉన్నారు. RRR - కేజీఎఫ్ 2 వంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు తప్పితే.. ఇతర సినిమాలు అంత రేటు పెట్టి థియేటర్లో చూడటానికి సిద్ధంగా లేరని అర్థం అవుతోంది. ఇవన్నీ ఆలోచించుకొని అందరూ 'ఎఫ్ 3' బాటలో సాధారణ రేట్లతో సినిమాలు రిలీజ్ చేయడం మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు.
Tags:    

Similar News