త్రిషను వెంటాడుతున్న ఐటీ

Update: 2017-06-09 12:47 GMT
సీనియర్ హీరోయిన్ త్రిషను ఆదాయపు పన్ను అధికారులు వెంటాడుతున్నారు. ఆరేళ్ల కిందటి కేసుతో ఆమెకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఎప్పుడో 2010-11 సంవత్సరానికి సంబంధించి త్రిష తాను సంపాదించిన మొత్తాని కంటే తక్కువ ఆదాయానికి పన్ను కట్టి ఇరుక్కుంది. ఆ సంవత్సరం ఆమె తన ఆదాయం రూ.89 లక్షలుగా చూపించింది. ఐతే ఆ ఏడాది నిర్మాతల దగ్గర్నుంచి ఆమె తీసుకున్న అడ్వాన్సుల సంగతి పక్కన పెట్టేసింది. ఆ డబ్బులకు పన్ను కట్టలేదు. ఆదాయపు పన్ను అధికారులు ఈ సంగతి గుర్తించి ఆమెకు రూ.1.19 కోట్ల జరిమానా విధించారు. అడ్వాన్సులు కూడా ఆదాయం కిందికే వస్తాయని.. త్రిష ఉద్దేశపూర్వకంగానే ఆ ఆదాయాన్ని కప్పి పెట్టిందని ఆదాయపు పన్ను శాఖ భావించి ఆమెకు జరిమానా విధించింది.

ఐతే దీనిపై త్రిష న్యాయ పోరాటం చేసింది. న్యాయం కోసం ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. ఈ కేసును పరిశీలించిన ట్రైబ్యునల్ త్రిషకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జరిమానాపై స్టే విధించింది. ఐతే ఈ వ్యవహారాన్ని అంతటితో వదిలేయట్లేదు ఐటీ అధికారులు. త్రిష కేసును ప్రత్యేకంగా తీసుకుని.. ట్రైబ్యునల్ తీర్పుపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు వివరాల్ని పరిశీలించిన మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వదిలిందనుకున్న వ్యవహారం మళ్లీ మెడకు చుట్టుకోవడంతో త్రిష మళ్లీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కేసు గెలుస్తుందో లేదో కానీ.. ఆదాయపు పన్ను ఎగ్గొట్టిందన్న ప్రచారం తనకు బాగా డ్యామేజ్ చేస్తుందని త్రిష కంగారు పడుతోంది. మరి ఈ కేసులో చివరికి ఏ తీర్పు వస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News