ద్రౌపదిని కాపాడే కథ.. శౌర్య రచయిత

Update: 2019-05-11 10:05 GMT
యంగ్ హీరో నాగశౌర్య కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. సొంత బ్యానర్ లో తెరకెక్కించిన ఛలో చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న నాగశౌర్య ఆ తర్వాత అమ్మమ్మ గారిల్లు.. కణం వంటి చిత్రాల్లో నటించాడు. బయటి బ్యానర్ లో చేసిన ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం దక్కించుకోలేదు. అటుపై సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో చేసిన నర్తన శాల సైతం తీవ్రంగా నిరాశపరిచింది. తదుపరి సమంత టైటిల్ పాత్ర పోషిస్తున్న ఓ బేబిలో శౌర్య కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత శౌర్య మరో సినిమాకి శ్రీకారం చుట్టారు. ఈసారి సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో మరో క్రేజీ చిత్రాన్ని నేడు హైదరాబాద్ మాదాపూర్ వీఎస్ ఎస్ స్క్వేర్ లో ప్రారంభించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చి .. స్క్రిప్టు ప్రతుల్ని చిత్ర దర్శకుడికి అందించారు. పరశురామ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ఈ సినిమా కథాంశం ఆసక్తికరం. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. స్క్రిప్టు దశలోనే దీనిపై చాలా హార్డ్ వర్క్ చేశామని శౌర్య తెలిపారు. అసలింతకీ ఈ సినిమా కథాంశం ఏంటి? అని ప్రశ్నిస్తే శౌర్య చెప్పిన కథ ఇదీ.. ''ద్రౌపది చీర లాగితే అందరూ నవ్వుతారు. కానీ అశ్వద్ధామ మాత్రం కాపాడే ప్రయత్నం చేస్తాడు. అలాంటి వివేకం బుద్ధి ఉన్న కుర్రాడి కథ ఇది. ఈ సినిమాకి కథా రచయితగానూ పని చేశాను'' అని తెలిపారు. ఈ నెల 13 నుంచి రెగ్యులర్ చిత్రీకరణను కొనసాగిస్తున్నారు. ఈ చిత్రంలో శౌర్య సరసన మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటిస్తోంది. ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెహ్రీన్ పలు క్రేజీ చిత్రాలకు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. శౌర్య సరసన తాజా చిత్రంలో ఓ యూత్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తోంది.

ప్రారంభోత్సవంలో నిర్మాత శరత్ మరార్, దర్శకుడు బీవీఎస్ రవి తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నాగశౌర్య.. నందిని రెడ్డి.. ఐరా క్రియేషన్స్ అధినేతలు.. ఉషా ముల్ పురి.. శంకర ప్రసాద్ ముల్ పురి .. తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, సత్య, ప్రియా రామన్, జయప్రకాశ్, కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించనున్న ఈ మూవీ ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ కానుంది.
    

Tags:    

Similar News