మెగాస్టార్ 'గాడ్ ఫాద‌ర్' ఎంత ప‌ని చేసింది?

Update: 2022-11-15 05:30 GMT
కొన్ని సినిమాల ఫ‌లితాలు కొత్త కాంబినేష‌న్ ల‌కు తెర తీస్తుంటాయి. అదే సినిమా ఫ్లాప్ అయితే .. యావ‌రేజ్ అనిపించుకుంటే మాత్రం సినిమా చేయాల‌ని అనుకున్న వారు కూడా అర్థాంత‌రంగా ఆ ప్రాజెక్ట్ ల‌ని వ‌దులుకుంటుంటారు. ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ కే తొలి ప్ర‌ధాన్యం. దాన్ని ప్రామాణికంగా తీసుకునే సినిమాలు, కాంబినేష‌న్‌లు తెర‌పైకి వ‌స్తుంటాయి. ఇదే ఫార్ములాని అనుస‌రించి కింగ్ నాగార్జున ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని తెర‌పైకి తీసుకుర‌నావాల‌నుకున్నారు. అయితే అది క్యాన్సిల్ అయిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

వివ‌రాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'గాడ్ ఫాద‌ర్‌'. మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫ‌ర్‌' ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్ ల‌పై ఎన్వీ ప్ర‌సాద్ నిర్మించారు. ఈ మూవీకి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రీసెంట్ గా విడుద‌లైన ఈ మూవీలోని కీల‌క అతిథి పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన విష‌యం తెలిసిందే.

ఈ మూవీ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో వుండ‌గానే కింగ్ నాగార్జున‌, అఖిల్ ల క‌ల‌యిక‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీని మోహ‌న్ రాజా చేయ‌బోతున్నార‌ని, ఈ ప్రాజెక్ట్ ని గ‌తంలోనే ఫైన‌ల్ చేసుకున్నార‌ని వార్త‌లు వినిపించాయి. 'గాడ్ ఫాద‌ర్‌' మూవీ ప్ర‌మోష‌న్స్ లో ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా అధికారికంగా ఈ ప్రాజెక్ట్ గురించి వెల్ల‌డించ‌డంతో త్వ‌ర‌లోనే అక్కినేని వారి మ‌ల్టీస్టార‌ర్ ప‌ట్టాలెక్క‌బోతోందంటూ ప్ర‌చారం జ‌రిగింది. 'తని ఒరువ‌న్ 2'కి ముందే ఈ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కిస్తాన‌ని కూడా మోహ‌న్ రాజా స్ప‌ష్టం చేశాడు.

అయితే ఇప్ప‌డు ఈ ప్రాజెక్ట్ కార్య‌రూపం దాల్చే అవ‌కాశం లేదని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. నీసెంట్ గా విడుద‌లైన 'గాడ్ ఫాద‌ర్‌' బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. అంతే కాకుండా వ‌సూళ‌క‌ల ప‌రంగానూ భారీ స్థాయిలో అభిమానుల‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాల‌ని కూడా నిరుత్సాహ ప‌రిచింది.

దీంతో మోహ‌న్ రాజా ప్రాజెక్ట్ విష‌యంలో నాగార్జున ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని వార్త‌లు వ‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతానికి త‌న‌తో సినిమా చేయాల‌నే ఆలోచ‌న‌ని ప‌క్క‌న పెట్టి మ‌రో ద‌ర్శ‌కుడితో సినిమా చేయాల‌ని నాగార్జున భావిస్తున్నార‌ట‌.

ఇంత‌లో ఎంత మార్పు అంటూ మెగాస్టార్ 'గాడ్ ఫాద‌ర్' ఎంత ప‌ని చేసిందని కొంత మంది కామెంట్ లు చేస్తున్నారు. 'గాడ్ ఫాద‌ర్‌' ఆశించిన స్థాయి ఫ‌లితాన్ని అందించి వుంటే మోహ‌న్ రాజాతో అక్కినేని వారి ప్రాజెక్ట్ సాఫీగా ప‌ట్టాలెక్కేద‌ని, ఫ‌లితం తారు మారు కావ‌డంతో నాగార్జున‌తో చేయాల‌నుకున్న ప్రాజెక్ట్ కూడా తారుమారైపోయింద‌ని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News