ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్‌కు మా ఎన్నిక‌ల‌కు లింక్ ఉందా...!

Update: 2021-06-25 03:30 GMT
ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్‌కు మా ఎన్నిక‌ల‌కు లింక్ ఏంటా ? అని ఆశ్చ‌ర్య పోతున్నారా ?  ప్ర‌స్తుతం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో మా ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం సాధార‌ణ ఎన్నిక‌లను ప్ర‌తిబింబిస్తోంది. గ‌త మూడు ట‌ర్మ్‌లుగా మా ఎన్నిక‌లు అంటే ఏపీ, తెలంగాణ‌లో జ‌రిగే సాధార‌ణ ఎన్నిక‌ల్లా పెద్ద యుద్ధంలా మారిపోయాయి. పైగా ఈ సారి మా ఎన్నిక‌లు ఎప్పుడూ లేన‌ట్టుగా నాలుగు స్తంభాలాట‌గా మారాయి. ప్ర‌కాష్ రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్ తో పాటు సీనియ‌ర్ న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్‌, హేమ కూడా నేరుగా అధ్య‌క్ష ఎన్నిక‌ల రేసులో ఉండ‌డంతో ఈ సారి మా ఎన్నిక‌లు మామూలుగా ఉండ‌వ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక మా ఎన్నిక‌లు జ‌రిగే ప్ర‌తిసారి మా కోసం సొంత బిల్డింగ్ క‌ట్టిస్తామ‌ని హామీలు ఇవ్వ‌డం.. మా అధ్య‌క్షులుగా గెలిచిన వారు రెండు నెల‌లు హ‌డావిడి చేసి.. త‌ర్వాత దాని గురించి మ‌ర్చిపోవ‌డం కామ‌న్ అయిపోయింది.

చిరంజీవి, మోహ‌న్ బాబు, ముర‌ళీ మోహ‌న్, నాగ‌బాబు, నాగార్జున లాంటి హేమాహేమీలంతా మా అధ్య‌క్షులుగా ప‌నిచేశారు. అంద‌రూ కూడా ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎన్నాళ్లు ఈ అద్దె భ‌వ‌నంలో మా బిల్డింగ్ ఉంటుంది.. మ‌న‌కో బిల్డింగ్ కావాల‌ని గొప్పగా చెపుతారు. వారు గెలిచాక ఆ సంగ‌తే మ‌ర్చిపోతారు. ఇప్పుడు ప్ర‌కాష్ రాజ్ సైతం ఇదే నినాదంతో మా ఎన్నికల బ‌రిలోకి దిగారు. ఫైవ్ స్టార్ సౌక‌ర్యాల‌తో తాను మా భ‌వ‌నం నిర్మిస్తాన‌ని ఆయ‌న హామీలు గుప్పిస్తున్నారు. ఇక మంచు విష్ణు, జీవిత సైతం ఇదే నినాదంతో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగడం దాదాపు ఖాయ‌మైంది. ఏపీ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు.. అక్క‌డ రాజ‌కీయంగా నిల‌దొక్కుకునేందుకు ప్ర‌త్యేక హోదా అంశం ఎలా వాడుకున్నారో ఇప్పుడు మా ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఇక్క‌డ పోటీ చేస్తోన్న వారు అలాగే మా బిల్డింగ్ నినాదాన్ని వాడుకుంటున్నార‌ని సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

ఏపీలో ప్ర‌త్యేక హోదా అంశం మీద చంద్ర‌బాబు ఐదేళ్ల పాటు రాజ‌కీయం చేశారు. ముందు ప్ర‌త్యేక హోదా ఏమైనా సంజీవ‌నా ?  ప్యాకేజీ చాలున్నారు. త‌ర్వాత హోదా కావాల‌న్నారు. ఇక ఎన్నిక‌ల‌కు ముందు హోదా అంశాన్ని ఎజెండాగా చేసుకుని అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ సైతం ఇప్పుడు బీజేపీకి ఫుల్ మెజార్టీ వ‌స్తే హోదా ఎలా వ‌స్తుందంటూ హోదా అనే మాట‌నే అట‌కెక్కించేశారు. దీంతో ఏపీకి హోదాను అక్క‌డ పార్టీలు గెలిచేందుకు ఎలా వాడుకుంటున్నాయో ? ఇక్క‌డ మా బిల్డింగ్‌ను కూడా మా ఎన్నిక‌ల్లో పోటీ చేసే వారు అలాగే వాడుకుంటున్నారు. వాస్త‌వంగా దేశంలోనే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకునే చాలా మంది స్టార్ హీరోలు టాలీవుడ్‌లోనే ఉన్నారు.

వీరంద‌రూ త‌లో ఓ చేయి వేస్తే మా బిల్డింగ్ మూడు నాలుగు నెల‌ల్లో కంప్లీట్ అవుతుంది. అయితే ఫిల్మ్‌న‌గ‌ర్‌లో స్థ‌లాల రేట్లు చుక్క‌ల్లో ఉన్నాయి. ఇప్పుడు అక్క‌డ మా కోసం అనువైన స్థ‌లం ఎంచుకోవాలంటేనే స్థ‌లానికే కోట్లు అవుతాయ‌ని చెపుతున్నారే త‌ప్పా ఎవ్వ‌రూ ఈ దిశ‌గా ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. ప్ర‌భుత్వం స్థ‌లం ఇస్తే చూద్దామంటున్నారే త‌ప్పా ఎవ్వ‌రికి నిజ‌మైన చిత్త‌శుద్ధి లేదు.
Tags:    

Similar News