దీన్ని మల్టీ స్టారర్ ఎలా అంటారు ?

Update: 2019-08-19 06:18 GMT
సినిమా పరిశ్రమలో మల్టీ స్టారర్ అనేది చాలా క్రేజీ పదం. ఒకే రేంజ్ లేదా మార్కెట్ ఉన్న ఇద్దరు హీరోలు కలిసి నటించినప్పుడు వచ్చే క్రేజ్ కానీ ఓపెనింగ్స్ కానీ చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. అందుకే ఎన్టీఆర్ - ఎఎన్ ఆర్ కాంబినేషన్ తో మొదలుకుని ఇప్పటి రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబోల దాకా ప్రేక్షకులు వీటి మీద చాలా ప్రత్యేక అంచనాలు పెట్టుకుంటారు. అలా అని ఇద్దరు హీరోలు ఉన్నంత మాత్రాన మల్టీ స్టారర్ అనేయడం కూడా కరెక్ట్ కాదు.

ఇప్పుడీ టాపిక్ రావడానికి కారణం వాల్మీకి. వరుణ్ తేజ్ హీరో కం విలన్ గా నటిస్తున్న వాల్మీకి వచ్చే నెల 13న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ లో వరుణ్ మాస్ లుక్స్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. కానీ ప్రమోషన్ మెటీరియల్ లో వాల్మీకిని మల్టీ స్టారర్ గా పేర్కొనడం అటు హీరోకు ఇటు మెగా ఫ్యాన్స్ కు అంతగా నచ్చడం లేదని ఫిలిం నగర్ టాక్. దీనికి స్పష్టమైన కారణం ఉంది.  వాల్మీకిలో హీరో లాంటి పాత్ర చేస్తున్న అధర్వను కోలీవుడ్ నుంచి తెచ్చారు. ఇతనో హీరో అని కూడా మనవాళ్లకు కనీసం ఐడియా లేదు.

ఆ మధ్య వచ్చిన నయనతార డబ్బింగ్ సినిమా అంజలి సీబీఐలో తమ్ముడి పాత్ర చేశాడు కానీ ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. తమిళ్ లో మాత్రం ఇతగాడికి మీడియం రేంజ్ మార్కెట్ ఉంది. ఇంతకు మించి అధర్వకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. అసలు పరిచయమే లేని హీరోని వాల్మీకిలో తీసుకుని ఇప్పుడు మల్టీ స్టారర్ అని చెప్పడం ఏంటని అభిమానుల ప్రశ్న. అధర్వకు ఇది మొదటి తెలుగు స్ట్రెయిట్ సినిమా. అలాంటప్పుడు స్టార్ అని సంబోధించడం న్యాయం కాదు. అందుకే వరుణ్ తేజ్ మూవీగానే వాల్మీకిని ప్రమోట్ చేయాలి తప్ప ఇలా మల్టీ స్టారర్ అనే ట్యాగ్ పెట్టకూడదని వాళ్ళ వెర్షన్. దర్శకుడు హరీష్ శంకర్ ఏమంటాడో మరి.

    

Tags:    

Similar News