నా లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ టైమ్ అదే: చరణ్

Update: 2022-04-22 17:30 GMT
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ''ఆచార్య'' సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగా తండ్రీకొడుకులు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇది చిరు - చెర్రీలకు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన తండ్రితో కలసి డ్యాన్స్ చేయడంలోని ఆనందాన్ని, గౌరవాన్ని మాటల్లో చెప్పలేనని చరణ్ పేర్కొంటున్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మెగా వారసుడు.. 'ఆచార్య' సినిమా గురించి ఆసక్తికరమైన సంగతులు పంచుకున్నారు. తన తండ్రితో కలిసి నటించిన అరుదైన అనుభవం గురించి తెలియజేసాడు.

గత నాలుగేళ్లుగా వేర్వేరు ఇళ్లలో ఉండటం వల్ల తన ఫాదర్ ని చాలా మిస్ అవుతున్నాని.. 'ఆచార్య' కారణంగా ఇద్దరం చాలా రోజుల తర్వాత ఒకే కాటేజీలో కలసి సమయం గడిపే అవకాశం కలిగిందని రామ్ చరణ్ వెల్లడించారు. ఆ నెల రోజుల షెడ్యూల్ షూటింగ్ కోసం ఎంతో ఎగ్జైట్మెంట్ గా వేచి చూశానని.. ఆ రోజులు మరపురానివని అన్నారు.

''కొత్త ఇంటి కన్స్ట్రక్షన్ పనుల వల్ల గత నాలుగేళ్లుగా మేమిద్దరం వేరు వేరుగా ఉంటున్నాం. అప్పుడప్పుడు వీకెండ్ సండేలలో కలుస్తుంటాం. అలాంటిది 'ఆచార్య' షూటింగ్ వల్ల 15 - 18 రోజులు ఇద్దరం కలిసి లేవడం.. కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడం.. ఒకే కారులో షూటింగ్ కు వెళ్లి తిరిగి రావడం.. ఉదయాన్నే లేచి వర్కౌట్స్ చేయడం.. ఇది నా లైఫ్ లో మోస్ట్ మోస్ట్ మెమరబుల్ టైమ్. నేను ఎంత చెప్పినా ఆ నిజమైన ఫీలింగ్ ని నేను ఎక్స్ ప్రెస్ చేయలేను'' అని రామ్ చరణ్ అన్నారు.

''నాకే ఇలా ఉంటే ఐదారు రోజుల తర్వాత నాన్న నా దగ్గరికి వచ్చి.. 'చరణ్.. నీకు అర్థం కావడం లేదు దీని వాల్యు. పనిలో బిజీగా ఉండడం వల్ల మనిద్దరం ఇలా కలిసి ఉండే అవకాశం ఎప్పుడో కానీ రాదు. నేను కూడా నీకోసం ఇంత సమయాన్ని మళ్లీ ఎప్పుడు కేటాయించగలనో తెలియదు. ఆచార్య వల్ల మనకీ అవకాశం వచ్చింది. ప్రతి క్షణాన్నీ చెరిష్ చేద్దాం' అని అన్నారు. నాకు ఆయనలా తెలియపరచడం తెలియదేమో కానీ.. ఆ మాటలకు నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఆయనను హగ్ చేసుకొని సరే అని చెప్పా'' అని చరణ్ వివరించారు.

'ఆచార్య' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మిచారు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. సోనూసూద్ - జిషు సేన్ గుప్తా - వెన్నెల కిశోర్ - పోసాని కృష్ణ మురళి - తనికెళ్ళ భరణి - సౌరవ్ లోకేష్ కీలక పాత్రలు పోషించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఆచార్య' సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా.. తిరునవుక్కరసు సినిమాటోగ్రఫీ అందించారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేయబడిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మెగా మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News