ఇది స‌క్సెస్ మీటా.. క్రిటిక్స్ పై ఎటాకా?

Update: 2019-10-22 06:32 GMT
ఫిలింక్రిటిక్స్ పై ఎటాక్ చేసే వారి జాబితా అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంది. ప్ర‌తిసారీ ఇది చూస్తున్న‌దే అయినా ఇటీవ‌ల క్రిటిసిజాన్ని అర్థం చేసుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. స‌రికదా?  సూటిగానే ఎటాక్ చేసేస్తున్నారు. ఒక‌ర‌కంగా క్రిటిక్స్ పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కేస్తున్నార‌నే చెప్పాలి. ఆర్జీవీ.. పూరి జ‌గ‌న్నాథ్ లాంటి పెద్ద స్థాయి ద‌ర్శ‌కులే క్రిటిక్స్ పై సెటైర్లు వేశారు. సినిమాలు తీసి అందులో సీన్ల‌నే చూపించేశారు. ఇక చోటా మోటా సినిమాలు తీసేవాళ్ల ఆవేద‌న అయితే అంతులేనిది. చెత్త సినిమాలు.. నాశిర‌కం సినిమాలు తీసి కూడా తిట్టేస్తున్న బాప‌తు ఇందులో ద‌ర్శ‌న‌మిస్తున్నారు.

తాజాగా ఓంకార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'రాజుగారి గ‌ది 3' స‌న్నివేశం అదే. ఈ సినిమాపై స‌మీక్ష‌కులు నెగెటివ్ రివ్యూల‌తో విరుచుకుప‌డ్డారు. రొటీన్ హార‌ర్ కామెడీ.. నాశిర‌కం కామెడీ అంటూ ఎద్దేవా చేశారు. ఈ విమ‌ర్శ‌ల్ని టీమ్ అస్స‌లు త‌ట్టుకోలేక‌పోయింది. హీరో.. సినిమాటోగ్రాఫ‌ర్.. క‌మెడియ‌న్ .. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ స‌మీక్ష‌కుల‌పై ఎటాక్ చేశారు. అది కూడా స‌క్సెస్ మీటా.. క్రిటిక్స్ పై ఎటాకింగ్ మీటా? అనేంత‌గా చెల‌రేగిపోయారు. క‌మెడియ‌న్ అలీ అయితే కోన్ కిస్కా గొట్టాం గాళ్లు అంటూ శ్రుతి మించిపోగా.. సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా.కె నాయుడు అయితే మ‌రో కొత్త కోణంలో తిట్టేశారు. 'కావాల‌నే కుట్ర చేస్తున్నారు.. ఇన్ సైడ‌ర్స్ (ప‌రిశ్ర‌మ వ్య‌క్తులే) ఇలా రాస్తున్నారు. ఇలాంటి వాళ్లంతా అలా రాయొద్దు' అంటూ హెచ్చ‌రించారు. హీరో అశ్విన్ అయితే డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చారు. 'చెత్త‌ రివ్యూల వ‌ల్ల టికెట్ బుకింగ్ యాప్ లో పూర్ రేటింగ్ క‌నిపిస్తోంది. అలా రావ‌డం ఏమో కానీ.. వాస్త‌వంలో మూవీ మాత్రం థియేట‌ర్లు జ‌నాల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. సినిమా బాగా ఆడుతున్నా.. రివ్యూలు రేటింగుల వ‌ల్ల మేం సంతోషంగా లేం' అని వాపోయారు.

ప‌రిశ్ర‌మ‌లో ఈ స‌మ‌స్య ప్రతిసారీ రిపీట‌వుతూనే ఉంది. అయినా.. ఆడే సినిమా ఏదో జ‌నాలే డిసైడ్ చేస్తున్న‌ప్పుడు .. థియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఒరిజిన‌ల్ గా రివ్యూలు చెబుతున్న‌ప్పుడు క్రిటిక్స్ రివ్యూలు మాత్ర‌మే డ్యామేజ్ చేస్తాయి అని ఎలా అన‌గ‌ల‌రు?  సినిమా  లో ద‌మ్ముంటే జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. వాళ్లే ఆడిస్తున్నారు. అలాంట‌ప్పుడు ఇలా ఆక్రోశం వెల్ల‌గ‌క్కి ఏం ఉప‌యోగం? ప‌బ్లిక్ లో మంచి మౌత్ టాక్ ఉన్న‌ప్పుడు బాక్సాఫీస్ వ‌సూళ్ల‌లో ఏ స‌మ‌స్యా ఉండ‌దు. టిక్కెట్ బుకింగ్ యాప్ ల‌లో రివ్యూలు వ‌చ్చినంత మాత్రాన అవేవీ గెలుపోట‌ముల్ని నిర్ణ‌యించ‌లేవ‌ని 'మంచి సినిమా'ల విష‌యంలో ప్రూవ్ అయ్యింది. అన్న‌ట్టు ప‌రిశ్ర‌మ సీనియ‌ర్ చోటా.కె.నాయుడు 'నెగెటివ్ రివ్యూలు.. ఇన్ సైడ‌ర్స్ ప‌నే' అన్నారు. ఇంత‌కీ ఆ ఇన్ సైడ‌ర్స్ ఎవ‌రై ఉంటారు?
Tags:    

Similar News