MAA వార్‌: స‌హ‌జ‌న‌టితో సింపుల్ గా చెక్ పెట్టిస్తున్నారా?

Update: 2021-06-29 12:30 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల ర‌చ్చ సినీపెద్ద‌ల‌కు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌కాష్ రాజ్ - మంచు విష్ణు  స‌హా మొత్తం ఆరుగురు స‌భ్యులు ఈసారి అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే వ‌ర్గ‌పోరు గొడ‌వ‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. కులం మతం ప్రాంతీయ‌త‌ అంటూ ర‌చ్చ వేడెక్కిస్తోంది. ఇంత‌కుముందు  రెండు ద‌ఫాలు మా అసోసియేష‌న్ లో ఇలాంటి గొడ‌వ‌లే బ‌య‌ట‌పడ్డాయి. ఒక‌రికొక‌రు స‌హ‌కారం లేకుండా చేయ‌డం వ‌ల్ల తీవ్ర విమ‌ర్శ‌ల పాలు కావాల్సి వ‌చ్చింది.

అందుకే ఈసారి ఎన్నిక‌ల‌తో ప‌ని లేకుండా ఏక‌గ్రీవం చేయాల‌ని సినీపెద్ద‌లు నిశ్చ‌యించిన‌ట్టు తెలుస్తోంది. ఆ మేర‌కు తెర‌వెన‌క మంత్రాంగం సాగిపోతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ ఏక‌గ్రీవ అధ్య‌క్ష‌రాలిని ఎంపిక చేయాల్సి వ‌స్తే ఎవ‌రిని ఎంపిక చేస్తారు? అంటే.. స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధకు ఆ అవ‌కాశం ద‌క్క‌నుంద‌ని తెలుస్తోంది.

జ‌య‌సుధ అంద‌రినీ క‌లుపుకుపోయే స్వ‌భావం ఉన్న సీనియ‌ర్ న‌టి. పైగా సినీపెద్ద‌లైన‌ చిరంజీవి.. మోహ‌న్ బాబు వంటి వారితో చ‌క్క‌ని స్నేహం ఉంది. మోహ‌న్ బాబుకు ఓకే క‌నుక విష్ణు అడ్డు చెప్ప‌రు. ఆయ‌న పోటీకి దిగే ఛాన్సుండ‌దు. అలాగే ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ ఇప్ప‌టికే జ‌య‌సుధ పేరును సూచించార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక వీకే న‌రేష్ కూడా ఒక లేడీ అధ్య‌క్షురాలు అయితే బావుంటుంద‌ని పెద్ద‌లు మాట ఇచ్చార‌ని అన్నారు. చివ‌రికి జీవిత కూడా ఈసారి మ‌హిళా అధ్య‌క్షురాలు అయితేనే బావుంటుంద‌ని అన్నారు.

ఏదేమైనా ఏక‌గ్రీవ నిర్ణ‌యం జ‌య‌సుధ‌కు ఫేవ‌ర్ గా ప‌ని చేస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అసోసియేష‌న్ ప‌రువు మ‌ర్యాద‌లు నిల‌బెట్టాలంటే పోటీప‌డేవాళ్ల కంటే అంద‌రినీ క‌లుపుకుని పోయేవాళ్లే ఉత్త‌మం అన్న భావ‌న నెల‌కొంది. దీంతో ఎన్నిక‌ల పేరుతో హ‌డావుడి చేస్తున్న వారికి స‌హ‌జ‌న‌టి రూపంలో సింపుల్ గా చెక్ పెట్టిన‌ట్టే.
Tags:    

Similar News