మెగాస్టార్ చిరంజీవికి, హీరో రాజశేఖర్‌కి మధ్య విభేధాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఈ ఇరు కుటుంబాల మధ్య గొడవలు కూడా చెలరేగాయి. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చిరంజీవి రాజకీయాల్లో రాణించలేరని ఓపెన్‌గా ప్రకటించినందుకు రాజశేఖర్‌పై మెగాభిమానులు విరుచుకుపడ్డారు. ఆ ఘటనలో చిరంజీవి స్వయంగా క్షమాపణ చెప్పారు. అయితే నాటి నుంచి ఇరు వర్గాల మధ్యా ఘర్షణ వాతావరణం నెలకొంది. జీవితారాజశేఖర్ కొన్ని సందర్భాల్లో చిరు కుటుంబంపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇటీవలే బీజేపీ ప్రభుత్వానికి జీవిత, రాజశేఖర్ సపోర్టునిచ్చారు. ఇదే నేపథ్యంలో తాజాగా జీవిత రాజశేఖర్ కేంద్ర సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా నియమితులయ్యారు. జీవితకు ఇక సెన్సార్‌బోర్డుపై ఆధిపత్యం చిక్కినట్టే. ఇటీవలి కాలంలో మెగా హీరోల జోరు బాక్సాఫీస్ వద్ద సుస్పష్టంగా ఉంది. పవన్, చరణ్, బన్ని, సాయిధరమ్, వరుణ్‌తేజ్, శిరీష్ ఇలా అరడజను హీరోలు మెగా ఫ్యామిలీ నుంచే ఉన్నారు. ఇక నుంచి వీళ్ల సినిమాలు రిలీజైతే ఎక్స్‌రే కళ్లతో స్కానింగ్ తప్పనిసరి అని సినీవర్గాల్లో ముచ్చటించుకుంటున్నారు. సినిమా విషయంలో జీవిత పారదర్శకంగా వ్యవహరిస్తారా? లేక అందరికీ సమన్యాయం పాటిస్తారా? అన్నదానిపైనే మెగా హీరోల సినిమాల రిలీజ్‌లు, విజయాలు ఆధారపడతాయని అనుకుంటున్నారు. దీనికి జీవిత ఓపెన్ స్టేట్‌మెంట్ ఏం ఇస్తారో చూడాల్సిందే.