అర్జున్ రెడ్డి - అరెక్స్ 100 పుణ్యమా అని..: జీవిత

Update: 2019-05-03 07:08 GMT
వరుణ్.. దివ్యా రావు హీరో హీరోయిన్లుగా నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్  'డిగ్రీ కాలేజ్'.  ఈ సినిమా ట్రైలర్  రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌ లో జరిగింది. ఈ కార్యక్రమానికి జీవిత చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.  ట్రైలర్ లో లిప్ లాక్ సీన్ లో బోల్డ్ సన్నివేశాలు ఉండడంతో ఖంగుతిన్న ఆమె నవ్వుతూనే గట్టిగా క్లాస్ పీకారు.

జీవిత మాట్లాడుతూ "డిగ్రీ కాలేజ్ ట్రైలర్ చూసిన తర్వాత మీరు నా లాంటి రాంగ్ పర్సన్‌ ను పిలిచారు అనిపించింది. నేను సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌ ను.. మీ సినిమా ఇంకా సెన్సార్ కాలేదనుకుంటున్నా. 'అర్జున్ రెడ్డి'.. 'RX 100' సినిమాల పుణ్యమా అని లిప్ లాక్ లేకుండా తెలుగు సినిమా లేదు అనే విధంగా పరిస్థితి దిగజారిపోయిందనిపిస్తోంది.  మీ సినిమా కార్యక్రమానికి వచ్చి నేను ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు.. నేను చూసిన దాంట్లో నాలుగైదు షాట్లు అలాంటివే ఉన్నాయి.. మీ పోస్టర్ కూడా అదే.. కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా దాచి ఉన్నంతవరకే అందం.  ఫర్ ఎగ్జాంపుల్.. మనం ఇల్లు కట్టుకుంటే బాత్రూంలో స్నానం చేస్తాం.. బెడ్ రూమ్ లో పడుకుంటాం.. హాల్లో కూర్చుంటాం. హాల్లోకి వచ్చి స్నానం చేయం కదా? ప్రతి మనిషి జీవితంలో శృంగారం ఉంటుంది.. సెక్స్ ఉంటుంది... అన్నీ ఉంటాయి.  అవి ఎక్కడ చేయాలో అక్కడ చేస్తేనే బాగంటుంది. పబ్లిగ్గా రోడ్డు మీద చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది'' అంటూ జీవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. 

ఈ రోజుల్లో ప్రతి సినిమాలో లిప్ లాక్ తప్పనిసరి అనే విధంగా తయారైందని.. బట్టలిప్పుకోవడం.. అమ్మాయిలు అబ్బాయిల మీద ఎక్కి కూర్చోవడం.. ఇలాంటి సీన్లు కామన్ అయిపోయాయని చెప్తూ మనం ఆ విషయం ఎత్తి చూపితే "ఇది మీ జీవితంలో లేదా?" అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. "మరి మన జీవితంలో లేదా అంటే..ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. కానీ మనం రోడ్డు మీద అలాంటి పనులు చేయం కదా? ముందు నుంచీ మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలా ఎందుకు చేయకూడదు అని అడ్డంగా మాట్లాడే దర్శకులతో మనం వాదించలేం" అంటూ బోల్డ్ సీన్లపై వితండవాదన చేసేవారికి చురకలు అంటించారు. 

"ప్రతి ఒక్కరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి... సోషల్ మీడియాలో.. టీవీల్లో ఇలాంటివి ఉండటం లేదా? అని కొందరు వాదిస్తారు. నిజమే ఉన్నాయి. కానీ వాటిని మనం ఒక రూములో.. ఒక్కరం కూర్చుని చూస్తాం. సినిమా అనేది కొన్ని వందల మందితో కలిసి చూసేది. చాలామంది మధ్యలో మనం శృంగారం చేయం. అసభ్యంగా ప్రవర్తించం. మూవీలో ఇలాంటివి వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది." అన్నారు. 

కొంతమంది ప్రతిదానికి సెన్సార్ బోర్డ్ ను విమర్శిస్తుంటారు.  ఇలాంటి సీన్స్ ఉన్నప్పుడు సెన్సార్ ఏం చేస్తుంది అంటారు. కానీ సెన్సార్ వారికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయని.. ఇవి వద్దని దర్శకులకు చెప్తే పెద్ద గొడవ చేస్తారని తెలిపారు. సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి సినిమాను ఆపేస్తున్నారని హంగామా చేస్తున్నారు.. కొందరు కోర్టులకు వెళుతున్నారని జీవిత  అన్నారు.  సెన్సార్ బోరు కానీ మరొకరు కానీ మనల్ని బాగుచేయలేరు.  మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి.  మనకూ కుటుంబాలు ఉన్నాయి.. ఇళ్ళలో పిల్లలు ఉన్నారనేది గుర్తుంచుకోవాలని ఆమె రచయితలు.. దర్శకులు.. నిర్మాతలను కోరారు.  

ప్రస్తుత ట్రెండ్ పై తన ఘాటు వ్యాఖ్యలకు 'డిగ్రీ కాలేజ్' మేకర్స్ అప్సెట్ అవుతారని అనుకున్నారో ఏమో కానీ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ "మీ సినిమాను నేను తప్పుబడట్టం లేదు. ఇప్పుడు ఉన్న ప్లోలో మీరు తీశారు. కానీ ఇలా తీస్తేనే సక్సెస్ అవుతుంది అనేది చాలా సరైన ఆలోచన కాదు.   మీరు బట్టలిప్పి అమ్మాయిలను చూపించినా సినిమాలో విషయం ఉంటేనే ఆడుతుంది. సెన్సార్ వారికి కూడా ఒక్కోసారి చాలా కష్టం అయిపోతుంది. కొన్ని సినిమాలకు సెన్సార్ ఇవ్వకూడదు.. ఆపేయాలని చెప్పాలనిపిస్తుంది. కానీ నిర్మాతలు ఎంతో డబ్బు పెట్టి ఉంటారు. వారిని తలుచుకుని అయ్యోపాపం వాళ్లు రోడ్డు మీదకు వచ్చేస్తారనే ఆలోచనతో కొన్ని కట్స్ సూచించి సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.  సినిమాలో అలాంటివి చూపించడం వల్ల ఇలాగే ఉండాలేమో అనే ఆలోచనలు యువతలో వచ్చే అవకాశం ఉంది. ఈ సమాజం గురించి ఆలోచించి సినిమాలు చేయండి. నేను మీ సినిమా కార్యక్రమానికి వచ్చి ఇలా మాట్లాడినందుకు సారీ.. ఇది కాంట్రవర్సీ కోసం చెప్పలేదు. నేను నా మనసులో ఉన్నది చెప్పాను. ఆ సీన్ల సంగతి పక్కన పెడితే మీ మేకింగ్ బావుంది.. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బావున్నాయి. ఈ సినిమా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను." అన్నారు.

సినిమా నిర్మాతల గురించి మాట్లాడుతూ "ఈ రోజుల్లో సినిమా తీయడం అనేది చాలా కష్టమైన పని. సినిమా తీయడం ఎంత కష్టమో దాన్ని రిలీజ్ చేయడం కూడా అంతే కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకున్న ఫ్యాషన్  తో.. ప్రేమతో.. ఎన్ని కష్టాలున్నా ఎదుర్కొని నాలాగా ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందులో నరసింహ నంది ఒకరు. ఈ సినిమాకు చాలా మంది నిర్మాతలు ఉన్నారని తెలిసింది. మీరు ఎవరూ నష్టపోకుండా ఈ సినిమా మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను" అని చెప్తూ జీవిత తన ఘాటు స్పీచ్ ని ముగించారు.


Tags:    

Similar News