కథలోనే హీరోయిజం ఉంది

Update: 2019-11-21 08:00 GMT
కొన్ని రోజుల ముందు వరకు జార్జ్‌ రెడ్డి గురించి పెద్దగా జనాలకు తెలియదు. కొద్ది మందికి మాత్రమే జార్జ్‌ రెడ్డి అనే వ్యక్తి ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన ఒక ఉద్యమ నాయకుడు అని తెలుసు. కొద్ది మందికి అసలు ఆ పేరు కూడా తెలియదు. కాని ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా జార్జ్‌ రెడ్డి గురించిన విషయాలు చర్చ జరుగుతున్నాయి. సోషల్‌ మీడియాలో జార్జ్‌ రెడ్డి కి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెడుతున్నారు. జార్జ్‌ రెడ్డి సినిమా కారణంగా ఇప్పుడు ఆయన గురించి జనాల్లో చర్చ మొదలైంది.

రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'జార్జ్‌ రెడ్డి' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సినిమాపై ప్రముఖులు మాట్లాడటంతో పాటు వివాదాలు కూడా చుట్టి ముట్టి ఉండటంతో సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు అప్పిరెడ్డి.. సంజయ్‌ రెడ్డి.. దామోదరరెడ్డిలు మాట్లాడుతూ సినిమాపై వారికి ఉన్న అంచనాలను తెలియజేశారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. దర్శకుడు జీవన్‌ రెడ్డి మొదట జార్జ్‌ రెడ్డి కథను చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యాను. రొటీన్‌ సినిమాలను కాకుండా ఇలాంటి సినిమాలు చేయడం వల్ల మంచి పేరు వస్తుందని భావించాము. కమర్షియల్‌ గా ఆలోచించకుండా డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని పక్కన పెట్టి ఈ సినిమాను తీశాం. సినిమా కోసం ఏకంగా ఉస్మానియా యూనివర్శిటీ సెట్‌ ను వేయడం జరిగింది. ఈ సినిమా మొదలు పెట్టడానికి ముందు దర్శకుడు జీవన్‌ రెడ్డి అయిదు నెలల పాటు ఉస్మానియా యూనివర్శిటీలోనే ఉన్నాడు. అక్కడ ఎంతో మందిని జార్జ్‌ రెడ్డి గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు జార్జ్‌ రెడ్డి సన్నిహితులతో కూడా మాట్లాడాడు.

ఈ కథలోనే హీరోయిజం ఉంటుంది. అందుకే కొత్త హీరో అయినా సరిపోతుందని భావించాం. అనుకున్నట్లుగానే పాత్రనే చూస్తున్నారు తప్ప అందులో నటించిన వ్యక్తి విషయంలో ఎక్కువ చర్చ జరగడం లేదన్నారు. తాము అనుకున్నదానికంటే ఎక్కువగా సినిమాకు బజ్‌ రావడంపై నిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Tags:    

Similar News