తమిళ స్టార్ హీరో సత్తా చాటుతున్నాడు

Update: 2015-07-31 10:03 GMT
తమిళ సినిమాలంటే ఎంతో కొంత వైవిధ్యం ఉంటుందని ఆశిస్తారు తెలుగు ప్రేక్షకులు. సాధారణంగా అలా కొత్తదనం ఉంటేనే ఆదరిస్తారు. అక్కడి నుంచి కూడా మాస్ మసాలా సినిమాలు వస్తే.. ఇవి మాకేమైనా కొత్తా అంటూ తిప్పి కొడుతుంటారు. అందుకే ‘జిల్లా’ సినిమా తెలుగులో ఆడకపోవచ్చని చాలామంది అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ సినిమా తెలుగులో బాగానే ఆడుతోంది.  పోయిన శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో హిట్టు కొట్టాలని చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న తమిళ స్టార్ హీరో విజయ్ కు ఆ కొరత కొంతవరకు తీర్చినట్లే కనిపిస్తోంది. పబ్లిసిటీ బాగా చేయడం వల్ల కావచ్చు.. బాహుబలి తర్వాత చెప్పుకోదగ్గ సినిమా లేకపోవడం వల్ల కావచ్చు.. ‘జిల్లా’ థియేటర్లలో జనాలు బాగానే సందడి చేస్తున్నారు.

డైరెక్ట్ తెలుగు మూవీ జేమ్స్ బాండ్ కు పోటీ ఇచ్చే స్థాయిలో ‘జిల్లా’ జోరు కనిపిస్తోంది. ఎమోషన్స్ బాగా పండటం.. విజయ్, మోహన్ లాల్ కెమిస్ట్రీ కుదరడం.. కాజల్ ఫ్యాక్టర్ కూడా తోడవడంతో జిల్లా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ఐతే లాభాల గురించి ఆలోచించకుండా విజయ్ కి తెలుగులో బేస్ పెంచాలన్న ఉద్దేశంతో సినిమాను నామమాత్రపు రేట్లకే అమ్మారు. ఐతే సినిమాకు మంచి టాక్ రావడంతో కలెక్షన్లు బాగున్నాయి. దీంతో బయ్యర్లందరూ త్వరగా బ్రేక్ ఈవెన్ కు వచ్చేసినట్లు సమాచారం. రెండో వారం వచ్చేదంతా లాభమే. ఈ వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో ‘శ్రీమంతుడు’ వచ్చే సమయానికి జిల్లా ఓ మోస్తరు లాభాలు అందుకునే అవకాశముంది. విజయ్ ఇంతకుముందు స్నేహితుడు, తుపాకి సినిమాలతో ఓ మాదిరి విజయాలందుకున్నాడు. వీటితో పోలిస్తే జిల్లా సాధించింది ఎక్కువే. విజయ్ ‘పులి’ సినిమాను భారీ స్థాయిలో తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకుంటున్న సమయంలో జిల్లా అందుకు మంచి పునాది వేసిపెట్టింది.
Tags:    

Similar News