డిప్రెష‌న్ గురించి ఓపెనైన ఎన్టీఆర్

Update: 2021-12-30 13:49 GMT
ప‌లు వేదిక‌ల‌పై ప్ర‌ముఖ హీరోలు డిప్రెష‌న్ గురించి ఓపెన‌వుతున్న తీరు ఆహ్వానించ‌ద‌గిన‌ది. చాలాసార్లు వేదిక‌ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న డిప్రెష‌న్ గురించి అభిమానుల‌కు చెబుతూ .. అలాంటి వాటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ధైర్యంగా ఉండాల‌ని సూచించారు. ఇంట‌ర్ ఫెయిల్ త‌ర్వాత త‌న ప‌రిస్థితిపైనా భ‌విష్య‌త్ పైనా ఆందోళ‌న గురించి మాట్లాడి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు ప‌వ‌న్.

అలాంటి క‌ష్ట కాలంలో అన్నా -వ‌దిన‌లు త‌నకి ఎంతో అండ‌గా నిలిచార‌ని అన్నారు. మంచు మోహ‌న్ బాబు.. దీపిక ప‌దుకొనే.. బ‌హిరంగ వేదిక‌ల‌పై త‌మ డిప్రెష‌న్ కెరీర్ పోరాటం గురించి చెబుతూ స్ఫూర్తి నింపుతుంటారు. సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో ఇలాంటి డిప్రెష‌న్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. నేడు అగ్ర క‌థానాయ‌కులుగా ఏలిన వారు అగ్ర నాయిక‌లుగా ఏల్తున్న వారు ఈ జాబితాలో ఉన్నారు.

తాజాగా ఆర్.ఆర్.ఆర్ ప్ర‌మోష‌న్స్ లో త‌న డిప్రెష‌న్ గురించి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఓపెన‌య్యారు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో అపజయాన్ని ఎదుర్కొన్న తర్వాత తాను కూడా ఒకసారి డిప్రెషన్ కు గురయ్యానని వెల్లడించాడు. రాజమౌళి స్టూడెంట్ నెం.1 సమయంలో తనకు ఏమాత్రం అవగాహన లేని ఔత్సాహిక న‌టుడిలా ఎలా ఉండేవాడో ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 18 ఏళ్ల వయసుకే ఆ త‌ర్వాత‌ తారక్ గొప్ప‌ విజయాన్ని ఎదుర్కొన్నాడు.

అయితే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనివార్యమైన పతనం ఎదురవుతుంది కాబట్టి ఎంతకాలం పాటు తాను విజయాన్ని చెక్కుచెదరకుండా ఉంచాలనేది ఆలోచిస్తున్నానని చెప్పాడు. ``బ్యాడ్ టైమ్ వచ్చినప్పుడు.. పతనం నన్ను తాకినప్పుడు నేను దానిని ధైర్యంగా స్ట్రాంగ్ గా ఎదురొడ్డాను. వర్కవుట్ అవ్వని సినిమాలు కెరీర్ లో ఉన్నాయి. నేను నిరాశకు గురయ్యాను.

సినిమాలు స‌క్సెస్ కాకపోవడంతో నటుడిగా నేను గందరగోళానికి గురయ్యాను. నేను ఏమి చేయాలో నాకు తెలియదు. కష్టకాలంలో రాజమౌళి సాంత్వన చేకూర్చారు. న‌టుడిగా తనను తాను ఆత్మపరిశీలన చేసుకునేలా చేశారు`` అని తారక్ వెల్లడించాడు. సినిమా సక్సెస్‌ కంటే గొప్పగా నటుడిగా ఎదిగాన‌ని గ‌ర్వంగా తెలిపారు.

RRR ప్రపంచవ్యాప్తంగా 7 జనవరి 2022న విడుదల అవుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌చార ఇంట‌ర్వ్యూల్లో తార‌క్ ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డిస్తున్నారు. ఇలా అగ్ర హీరోలు.. టాప్ సెల‌బ్రిటీలు త‌మ జీవితంలో ఎదుర్కొన్న గ‌డ్డు ప‌రిస్థితుల‌ను వివ‌రంగా చెప్పి ఇత‌రుల‌కు ఎదురైనా వాటిని ఎదుర్కొనే ధైర్యం నింపేందుకు ప్ర‌య‌త్నిస్తూ స్ఫూర్తినివ్వ‌డం ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం.



Tags:    

Similar News