డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ కి అనుకూలంగా తీర్పు..!

Update: 2020-12-11 09:00 GMT
బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన రియా చక్రవర్తితో రకుల్ జరిపిన వాట్సాప్ చాటింగ్ గురించి ఎన్సీబీ ఆమెను ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో అనేక కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే తనకు వ్యతిరేకంగా మీడియా కథనాలు ప్రచారం చేయడాన్ని రకుల్ ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఎన్సీబీ విచారణ పూర్తయ్యేంతవరకు తన పేరును ఈ కేసులో ప్రస్తావించకుండా ఎలక్ట్రానిక్ - ప్రింట్ - వెబ్ మీడియాను నియంత్రించాలని కోరింది. అయితే పీసీఐ మరియు ఎన్బీఏ నుంచి ఎలాంటి మార్గదర్శకాలు బయటకు రాకపోవడంతో రకుల్ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తనపై ఇష్టారాజ్యంగా మీడియాలో కథనాలు వస్తున్నాయని ఆమె మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తాజాగా న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ రకుల్ ప్రీత్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ కు క్షమాపణలు చెబుతూ డిసెంబర్ 17న కథనాన్ని ప్రసారం చేయాలని పలు న్యూస్ ఛానల్స్ కి ఆదేశాలు జారీ చేసింది. తమ మార్గదర్శకాలకు అనుగుణంగా కథనాన్ని ప్రసారం చేసి.. ఆ విషయాన్ని ప్రసారం చేసిన వారం రోజుల్లోగా లిఖిత పూర్వకంగా నివేదించాలని ఎన్బీఎస్ఏ పేర్కొంది. వీటిలో జీ గ్రూప్ కు చెందిన మూడు ఛానెల్స్ తో పాటు టైమ్స్ నౌ - ఇండియా టీవీ - ఆజ్ తక్ - ఇండియా టుడే - న్యూస్ నేషన్ - ఏబీపీ వంటి ప్రధాన వార్తా ఛానెల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసులో తమ వెబ్ సైట్స్.. ఇతర సోషల్ మీడియా మాధ్యమాల నుంచి రకుల్ ప్రీత్ సింగ్ కు వ్యతిరేకంగా ఇచ్చిన లింక్స్ ని డిలీట్ చేయాలని.. ఈ ఆదేశాల్ని తక్షణం అమలు చేయాలని అథారిటీ ఆదేశించింది. దీంతో రకుల్ కోర్టు మెట్లెక్కి తనకు అనుకూలంగా తీర్పు రాబట్టిందని చెప్పవచ్చు.


Tags:    

Similar News