ఆ పాత్రలో ఇప్పుడు జ్యోతిక

Update: 2018-02-19 04:38 GMT
బాలీవుడ్ లో నేటి తరం నటుల్లో అద్భుతమైన నటిగా గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ విద్యాబాలన్. ఏ పాత్ర ఇస్తే అందులో ఒదిగిపోయి అందరి ప్రశంసలు దక్కించుకోవడం ఆమె ప్రత్యేకత. గతేడాది సగటు మధ్యతరగతి ఇల్లాలి పాత్రలో తుమ్హారీ సులు సినిమాలో నటించింది. ఇందులో విద్య నటనకు అవార్డులు.. ప్రేక్షకుల ప్రశంసలూ రెండూ దక్కాయి.

ఇప్పుడు తుమ్హారీ సులు సినిమాను తమిళంలోకి రీమేక్ చేయబోతున్నారు. ఈ పాత్ర జ్యోతికను వరించింది. తమిళ హీరో సూర్యను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం గడుపుతున్న ఆమె తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. దీంతో జ్యోతిక ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయగలదనే నమ్మకంతో ఆమెను ఎంపిక చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను రాధామోహన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది. అందులో జ్యోతిక చెవుడు-అంధురాలి పాత్ర పోషించింది. ఈసారి మద్యతరగతి కుటుంబ జీవన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సులోచన అనే ఓ మామూలు గృహిణికి అనుకోనివిధంగా రేడియో జాకీగా పనిచేసే అవకాశం వస్తుంది. అదీ రాత్రివేళల్లో వచ్చే ప్రసారాలకు. అది ఆమెకు విపరీతమైన గుర్తింపు తీసుకొస్తుంది. ఇది ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందనేదే తుమ్హారీ సులు కథాంశం. మహిళా ప్రేక్షకులకు నచ్చే కథాంశం కావడంతో జ్యోతిక కూడా ఈ పాత్ర చేయడానికి ఓకే చెప్పిందని కోలీవడ్ లేటెస్ట్ టాక్.
Tags:    

Similar News