‘కబాలి’.. ఫ్రస్టేషన్లో అందరూ సైలెంట్

Update: 2016-07-07 05:51 GMT
హిట్టు కొట్టనీ.. ఫ్లాపులు ఎదురవనీ.. రజినీకాంత్ కొత్త సినిమా వస్తోందంటే.. ఆ క్రేజే వేరుగా ఉంటుంది. ఆయన్ని తెరమీద చూసుకోవడానికి కోట్లాది మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. అలాంటపుడు రిలీజ్ డేట్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉండాలి. కానీ ‘కబాలి’ టీం దగ్గర అలాంటి ప్రణాళికేమీ లేకపోయింది. మే 27 మొదలుకుని.. ఇప్పటిదాకా ఈ సినిమా రిలీజ్ డేట్ నాలుగైదు సార్లు మారింది. జులై 15న పక్కా అంటే ఆ తేదీని కూడా వదిలేశారు. ఇప్పుడు జులై 22న లేదంటే 29న అంటున్నారు. రెండు రోజులుగా 22న పక్కా అని న్యూస్ వస్తోంది. ఐతే ఇప్పటికే చాలాసార్లు పక్కా అనుకున్న డేట్లు పక్కకు వెళ్లిపోవడంతో జనాల్లో విపరీతమైన ఫ్రస్టేషన్ వచ్చేసింది.

మలేషియాలో జులై 21న వీవీఐపీ ప్రిమియర్ షో ఒకటి ప్లాన్ చేస్తున్నట్లు.. దానికి సంబంధించిన టికెట్లను కూడా నెట్లో పెట్టారు. అయినప్పటికీ జనాల్లో నమ్మకం కుదరట్లేదు. ఇంతకుముందు జులై 1న రిలీజ్ అని.. 15న రిలీజ్ అని.. ప్రమోషనల్ పోస్టర్లు వచ్చాయి. అయినా ఆ తేదీల్ని తర్వాత వదిలేశారు. ఇప్పుడీ ప్రిమియర్ షో కూడా అదే తరహాలో అవుతుందని జనాలు లైట్ తీసుకుంటున్నారు. తరణ్ ఆదర్శ్ లాంటి ప్రముఖులు ‘కబాలి’ రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసినా సరే.. జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరు. దీనికి ప్రధాన కారణం కబాలి దర్శక నిర్మాతలు ఎక్కడా రిలీజ్ డేట్ గురించి నోరు మెదపకపోవడమే. కాబట్టి తమిళ వెర్షన్ సెన్సార్ పూర్తయి.. స్వయంగా నిర్మాతే రిలీజ్ డేట్ ప్రకటిస్తే తప్ప జనాలు నమ్మే పరిస్థితి లేదు. మరి కలైపులి థాను మాటేంటో చూద్దాం.
Tags:    

Similar News