సల్మాన్ ని మొద్దబ్బాయ్ అనేసింది

Update: 2016-06-24 04:34 GMT

సుల్తాన్ సినిమాలో పాత్ర చేసేందుకు తను ఎంత కష్టపడ్డాడో చెప్పడాన్ని వర్ణించేందుకు గాను.. సల్మాన్ ఎంచుకున్న రూట్ పై ఇంకా వివాదం సద్దుమణగ లేదు. నిజంగా కష్టపడ్డానని చెప్పడమో.. లేక సుల్తాన్ రిలీజ్ కి ముందు వివాదంతో ఉచిత పబ్లిసిటీపై కన్నేయడమో చెప్పలేం కానీ.. ఈ గొడవ మాత్రం ఇంకా ముదురుతూనే ఉంది. ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా సల్లూభాయ్ పై తీవ్రమైన కామెంట్స్ నే చేసింది.

సల్మాన్ ఎపిసోడ్ పై ఇప్పటివరకూ చాలామంది స్పందించారు కానీ.. బాలీవుడ్ హీరోయిన్ల నుంచి మాత్రం రియాక్షన్ రాలేదు. దీనికి బ్రేక్ వేస్తూ.. కండలవీరుడిని ఏకి పడేసింది కంగనా. 'ఇదో భయంకరమైన పరిస్థితి. ఇలాంటి కామెంట్స్ మొద్దుబారిపోయిన వాళ్లే చేయగలరు. అవతలివారిని తక్కువ చేసి.. తాము గొప్ప అని ఫీల్ అయ్యే ఇలాంటివాటిని ప్రోత్సహించకూడదు' అని చెప్పింది కంగనా. 'సమాజంలో ఉన్నందుకు మనకు బాధ్యత ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా కంటే సామాజికంగా కీడు చేస్తాయి' అని చెప్పింది కంగనా.

సల్మాన్ ఆలోచనా విధానానికే ఎక్కువగా బాధ పడాలన్నది ఈ క్వీన్ ఫీలింగ్. మొత్తానికి టాప్ స్టార్స్ లో ఒకడైన సల్మాన్ ఖాన్ పై కామెంట్స్ చేయడం ద్వారా.. హీరోయిన్లలో కంగనా రనౌత్ వేరయా అనే కామెంట్ కు ఈ భామ న్యాయం చేసిందని చెప్పాలి. మరి మిగిలిన టాప్ హీరోయిన్లు ఎప్పుడు నోరు విప్పుతారో?
Tags:    

Similar News