ఇది మామూలు రిస్క్ కాదు

Update: 2018-01-11 07:44 GMT
క్వీన్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనకున్న అభిమానులను రెట్టింపు చేసుకున్న ఉంగరాల జుత్తు సుందరి కంగనా రౌనత్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. రొటీన్ అంశాలు లేకుండా తనలో నటికి ఛాలెంజ్ విసిరే పాత్రలనే కోరి మరీ ఎంచుకుంటుంది. అదే తనను మిగిలిన హీరొయిన్లను వేరు చేసి చూపిస్తోంది. క్రిష్ రూపొందిస్తున్న మణికర్ణిక సినిమా కోసం నిజమైన కత్తి యుద్ధం చేస్తూ గాయాల పాలై నుదుటి మీద కుట్లు వేయించుకునే దాకా తెచ్చుకున్న కంగనా పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా భయపడేది లేదు అంటుంది. తాను అనుకున్నది చెప్పడంలో ముక్కుసూటిగా వ్యవహరించే కంగనా ఇప్పుడు మరో సాహసానికి సిద్ధ పడుతోంది.

మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందిన అరుణిమ సిన్హా బయోపిక్ లో నటించేందుకు కంగనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. దీని కోసం ప్రత్యేకంగా ట్రెక్కింగ్ లో శిక్షణ తీసుకోవడానికి కూడా సిద్ధ పడింది. కాని షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేకపోవడంతో మరో రిస్కీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిందని వార్త. పా, ప్యాడ్ మ్యాన్ లాంటి క్లిష్టమైన కథలతో సినిమాలు తీసి ప్రత్యేకమైన అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరున్న బల్కీ కంగనాకు ఒక కథ చెప్పారట.

అందులో హీరొయిన్ కు ఎడమ వైపు శరీరం మొత్తం చచ్చుబడిపోయి ఏ భాగం పనిచేయని అసహాయ స్థితిలో ఉంటుందట. కుడి వైపు మాత్రం బాడీ యాక్టివ్ గా ఉంటుంది. బల్కీ కథ చెప్పగానే మారు మాట్లాడకుండా ఓకే చెప్పిన కంగనా దీని కోసం రెండు నెలల పాటు ట్రైనింగ్ కోసం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మణికర్ణిక పూర్తైన వెంటనే ఇది స్టార్ట్ అవుతుంది. కంగనాకు మెంటార్ గా తనలో స్ఫూర్తి నింపే పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. గతంలో ఇలాంటి పాత్రలో బిగ్ బి బ్లాక్ సినిమాలో అందురాలిగా నటించిన రాణి ముఖర్జీకి సహాయం చేసే కోచ్ గా కనిపించారు. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
Tags:    

Similar News