'కాంతార‌'..హోంబ‌లే మేక‌ర్స్ క్రేజీ ప్లాన్స్‌!

Update: 2022-12-01 02:30 GMT
క‌న్న‌డ హీరో, ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి తెర‌కెక్కించిన `కాంతార`. `కేజీఎఫ్‌` మేక‌ర్స్ హోంబ‌లే ఫిలింస్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ ఊహ‌కంద‌ని విధంగా వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తూ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. సెప్టెంబ‌ర్ 30న క‌న్న‌డ‌లో విడుద‌లైన ఈ మూవీ విజ‌య ప‌రంప‌ర ఇప్ప‌టికీ వివిధ భాష‌ల్లో అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతూ ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యప‌రుస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అక్టోబ‌ర్ 15న విడుద‌లైన ఈ మూవీ ఇక్క‌డ కూడా అదే హ‌వాని కొన‌సాగిస్తోంది.

అక్టోబ‌ర్ 14న హిందీలో విడుద‌లైన ఈ మూవీకి అక్క‌డ కూడా ఉత్త‌రాది ప్రేక్ష‌కులు బ్రహ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇప్ప‌టికీ అక్క‌డ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ దూసుకుపోతోంది. హిందీలో భారీ స్థాయిలో అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన క‌న్న‌డ సినిమాగా రికార్డుని సొంతం చేసుకుంది. అంతే కాకుండా వియ‌త్నాంలో విడుద‌లైన తొలి క‌న్న‌డ సినిమా కూడా చ‌రిత్ర సృష్టించింద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల‌లో ఈ మూవీ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

అంతే కాకుండా 2022 లో విడుద‌లై క‌న్న‌డ సినిమాల్లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా ఆల్ టైమ్ రికార్డుని సొంతం చేసుకున్న ఈ మూవీ కేజీఎఫ్ త‌రువాత ఆ స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగానూ నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని భాష‌ల్లో క‌లిపి వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 400 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి రికార్డులు సృష్టిస్తోంది. థియేట‌ర్ల‌లో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుద‌ల‌వుతుందా అని ఎదురు చూసిన ఓటీటీ ప్రియుల‌ని స‌ర్ ప్రైజ్ చేస్తూ ఈ మూవీని న‌వంబ‌ర్ 24న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుద‌ల చేశారు.

క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ వెర్ష‌న్ లు ఓటీటీలో రిలీజ్ కాగా అక్క‌డ ఈ మూవీకి మిశ్ర‌మ స్పంద‌నే ల‌భిస్తోంది. సినిమా `రంగ‌స్థ‌లం`ని పోలి వుంద‌ని కొంత మంది కామెంట్ లు చేస్తుంటే స్టార్టింగ్ .. క్లైమాక్స్ మిన‌హా సినిమాలే ఏమీ లేద‌ని మ‌రి కొంత మంది పెద‌వి విరుస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీని హోంబ‌లే ఫిలింస్ వారు తులు భాష‌లో డిసెంబ‌ర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండ‌టం విశేషం.

థియేట్రిక‌ల్ ర‌న్ లో అద్భుతాలు సృష్టిస్తున్న ఈ మూవీని ఇత‌ర దేశాల్లోనూ ఇంగ్లీష్ వెర్ష‌న్ లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇంగ్లీష్ వెర్ష‌న్ ని థియేట‌ర్ లో రిలీజ్ చేస్తారా?  లేక ఓటీటీలో రిలీజ్ చేస్తారా? అన్న‌ది క్లారిటీ రావాల్సి వుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News