సావిత్రి చేతికి ఎముక లేదు:కాసు కృష్ణారెడ్డి

Update: 2018-06-01 11:06 GMT
లెజెండ‌రీ హీరోయిన్ సావిత్రి జీవిత చ‌రిత్ర ఆధారంగా నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన మ‌హాన‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్ తో రికార్డు క‌లెక్ష‌న్లు వ‌సూలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాలో మ‌హాన‌టి సావిత్రి ద‌యాగుణం - దాతృత్వం గురించి తెలుసుకున్న ప్రేక్ష‌కులు ఆమెపై ప్ర‌శంసల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఎంద‌రి జీవితాల్లోనో వెలుగులు నింపింది గ‌న‌కే ఆమె మ‌హాన‌టి అయింద‌ని లేదంటే మ‌రోన‌టి అయ్యేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాజాగా, మహానటి సావిత్రి గురించి కాంగ్రెస్ మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి పలు ఆసక్తికర విషయాలు వెల్ల‌డించారు.  సావిత్రి దానకర్ణురాలని - అడిగిన వారికి...అడ‌గ‌ని వారికి అనేక దాన ధర్మాలు చేసేవార‌ని చెప్పారు. తన ద‌గ్గ‌ర ప‌ని చేసేవారు ఆమెను మోసం చేసినా పట్టించుకోని గొప్ప మ‌న‌సున్నవార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. త‌న అమ్మగారితో సావిత్రికి మంచి అనుబంధం ఉండేదని - తామిద్ద‌రం సావిత్రిని కలిసేవాళ్ల‌మ‌ని అన్నారు. ఓ ఇంటర్వ్యూ సంద‌ర్భంగా సావిత్రి కుటుంబంతో త‌మ‌ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని కాసు గుర్తు చేసుకున్నారు.

తాను సావిత్రిని ఆంటీ అని పిలిచేవాడినని కాసు అన్నారు. స్టార్ హీరోల కన్నా ఎక్కువ పారితోషికం సావిత్రి తీసుకునే వారని చెప్పారు. గ‌తంలో టాలీవుడ్ ను ఏలిన ఆమెకు కొడైకనాల్ లో ఒకటి - హైదరాబాద్‌ లో రెండు - విజయవాడలో ఒకటి - చెన్నైలో 4 బంగళాలతో పాటు చాలా ఆస్తులున్నాయ‌ని చెప్పారు. ఆమె సాయం చేసిన‌వారెవ‌రూ ఆమె ఆప‌ద‌లో అవ‌స‌రంలో ఉన్న‌పుడు ఆదుకోలేద‌న్నారు. ఆర్మీకి సాయం చేసేందుకు నిలువు దోపిడీ ఇచ్చార‌ని, అదేకాక ఎన్నో దానాలు చేశార‌ని తెలిపారు. సావిత్రి ఆంటీ కూతురు విజయ చాముండేశ్వరితో కూడా త‌న‌కు మంచి అనుబంధం ఉందన్నారు. సావిత్రి ఇంటి పక్కన స్థలంలో విజయ చాముండేశ్వరి ఇల్లు కట్టుకున్నారని - కొంత‌కాలం క్రితం దానిని అమ్మేసి మోంటియత్ రోడ్ ఎగ్మూర్ లో 5 కోట్ల విలువ చేసే ఫ్లాట్ తీసుకున్నార‌ని చెప్పారు. సావిత్రి ఆంటీ - జెమినీ గణేశన్ క‌లిసిమెల‌సి ఉండ‌డం..విడిపోవ‌డం రెండూ చూశాన‌ని చెప్పారు. 1958లో తొలి ఇన్ కంటాక్స్ రైడ్ జరిగిందని - ఆ తర్వాత కూడా రైడ్స్ జరగ‌డంతో ఆమె ఆస్తులు పోయాయ‌న్నారు. 25 డైమండ్ నక్లెస్ లు - చాలా డబ్బు పోయిందన్నారు. త‌న జ‌న్మ‌స్థ‌లం వడ్డివారి‌పాలెంలో స్కూలు కోసం 1960ల్లో 25 వేలు డొనేట్ చేశార‌ని - ఆమె చేతికి ఎముక‌లేద‌ని కితాబిచ్చారు.
Tags:    

Similar News